Tammineni Sitaram: రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నిన్నటి వరకు మనం ముఖం చాటేసిన వారినే పలకరించాల్సి ఉంటుంది. వారి సాయాన్ని అభ్యర్థించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఆమదాల వలస నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు పార్టీలోనే వ్యతిరేకత ఉంది. నాలుగు వర్గాలు కొనసాగుతున్నాయి. ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో సీనియర్ నేత సువ్వారి గాంధీ పార్టీని వీడారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి సీతారాంకు గట్టి సవాలే విసురుతున్నారు. మరోవైపు మిగతా మూడు వర్గాలు కూడా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తమ్మినేని సీతారాం ఇక్కడ ఎదురీదక తప్పడం లేదు. ఇప్పుడు వ్యతిరేక వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
తమ్మినేని సీతారాంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్,చంద్రబాబు క్యాబినెట్లలోకీలక మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల్లో చివరిసారిగా గెలిచారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. అటు తరువాత టిడిపిలో చేరినా చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో ఆయనను కాదని కూన రవికుమార్ కు సీటు ప్రకటించారు. దీంతో తమ్మినేని వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అదే రవికుమార్ పై గెలుపొందారు.
గత ఎన్నికల్లో అన్ని వర్గాలు తమ్మినేని గెలుపునకు సహకరించాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోని సీనియర్ నేతలను తమ్మినేని సీతారాం కుటుంబం తొక్కి పెట్టింది. దీంతో ఇక్కడ సువారి గాంధీ, కోట బ్రదర్స్, చింతాడ రవికుమార్ తో పాటు మరో వర్గం తమ్మినేని నాయకత్వాన్ని వ్యతిరేకించాయి. ఆయనకు టిక్కెట్ ఇస్తే సపోర్ట్ చేయమని నేరుగా హై కమాండ్కే తెలియజేశాయి. కానీ అధినాయకత్వం దీనిని పట్టించుకోలేదు. మరోసారి తమ్మినేని సీతారాంకి టికెట్ ప్రకటించారు. దీంతో మనస్థాపానికి గురైన సువ్వారి గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. మిగతా మూడు వర్గాలు సైలెంట్ అయ్యాయి. ప్రచారంలో సైతం పాల్గొనడం లేదు. దీంతో ఇది మైనస్ గా మారుతోంది.
ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాలవలస నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కలివరం పంచాయతీ తమ్మయ్య పేటలో పర్యటించారు. తమ్మినేని వ్యతిరేకిస్తున్న కోట బ్రదర్స్ ఇంటికి ఆయన వెళ్లారు. కానీ అందులో ఒకరైన కోట గోవిందరావు మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో స్పీకర్ ఆయన చేతిలో కరపత్రం పెట్టి.. నమస్కరించి వెళ్లిపోయారు. మీడియాలో దీనిపై కథనాలు రావడం చర్చినియాంశమైంది. ఆమదాలవలసలో వైసీపీలోని వర్గ రాజకీయాలు తప్పకుండా దెబ్బతీస్తాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సాక్షాత్ స్పీకర్ నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.