YCP Party : కుప్పంలో జెండా పీకేసిన వైసిపి.. రెస్టారెంట్ గా మారిన పార్టీ కార్యాలయం!

వైసీపీ నేతలు ఎన్నెన్నో ప్రగల్బాలు పలికారు. అధికార మదంతో చాలా రకాల ప్రకటనలు చేశారు. స్థాయికి మించి స్టేట్మెంట్లు ఇచ్చారు. ముఖ్యంగా చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని శపధం చేశారు. కానీ అదే కుప్పంలో వైసిపి నేతలు అడ్రస్ లేకుండా పోయారు.

Written By: Dharma, Updated On : October 23, 2024 12:08 pm

Kuppam Constituency YCP Party

Follow us on

YCP Party :  ఈ ఎన్నికలకు ముందు వైసీపీలో ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. అతి విశ్వాసానికి దారితీసిన సందర్భాలే అధికం. ఈ తరుణంలోనే వైసీపీ నుంచి బలమైన స్లొగన్ వినిపించింది. వై నాట్ 175, వై నాట్ కుప్పం, వై నాట్ మంగళగిరి, వై నాట్ పిఠాపురం, వై నాట్ హిందూపురం.. ఇలా ఒకటేమిటి తమ నోటికి వచ్చినట్టు మాట్లాడేవారు వైసీపీ శ్రేణులు. అన్నింటికీ మించి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని శపధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమని సౌండ్ చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గింది. ఎప్పుడూ 50వేలకు పైబడి ఉండే మెజారిటీ 30 వేలకు తగ్గడంతో వైసీపీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకవైపు అధికార అండదండలతో కుప్పం పై పట్టు పెంచేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఏకపక్ష విజయం దక్కేసరికి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామన్న ధీమాకు వచ్చారు. ఒకవైపు అభివృద్ధి పనులతో పాటు మరోవైపు టిడిపి శ్రేణులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అన్నింట సక్సెస్ కావడంతో ఎన్నికల్లో గెలవడమే తరువాయి అన్నట్టు వ్యవహరించారు. కుప్పంలో దాదాపు గెలిచేశామన్న ధీమాకు వచ్చారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీస స్థాయిలో కూడా ఓట్లు దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కుప్పంలో వైసీపీ ఉనికి లేదు. చివరకు పార్టీ కార్యాలయాన్ని సైతం ఖాళీ చేసే పరిస్థితి దాపురించింది.

* కుప్పం పై ప్రత్యేక ఫోకస్
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ కుప్పం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కేవలం ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలన్న వ్యూహంతో.. కుప్పంకు నిధుల వరద సృష్టించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. భరత్ అనే బిసి యువకుడికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. అదే సమయంలో పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు జగన్. వ్యూహాత్మకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసిపిని బలీయమైన శక్తిగా మార్చారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ప్రలోభాలు, భయాందోళనకు గురిచేసి వైసీపీ వైపు తిప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించారు. భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థి దే విజయం అని ధీమాతో ఉండేవారు. కానీ వారు ఒకటి తలిస్తే.. కుప్పం ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. చంద్రబాబుకు మరోసారి భారీ విజయం కట్టబెట్టారు.

* అప్పట్లో విధ్వంసాలు
వై నాట్ కుప్పం అని సౌండ్ చేసిన వైసీపీ ఇప్పుడు.. కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. వైసీపీ హయాంలో చంద్రబాబు కుప్పం వస్తే అడ్డగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే విధ్వంసం సృష్టించారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వైసిపి నేతల అడ్రస్ గల్లంతయ్యింది. చెట్టుకొకరు పుట్టకొకరు గా వెళ్ళిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ జాడలేదు. పార్టీ కార్యాలయం కోసం వినియోగించిన భవనం ఇప్పుడు క్లోజ్ అయింది. దానిని ఓ రెస్టారెంట్ నిర్వహణకు భరత్ అద్దెకి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు కుప్పం వైసీపీలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. భరత్ మిస్సింగ్ అంటూ పార్టీలో వేరే వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీలు అంతా టిడిపి బాట పడుతున్న తరుణంలో.. భరత్ సైతం ఆ పార్టీ గూటికి చేరుతారా? అన్న అనుమానం కలుగుతోంది.