Heat Waves
Heat Waves: ఇంకా ఎండాకాలంలో ప్రవేశించలేదు. ఫిబ్రవరి( February) మొదటి వారంలోనే ఉన్నాము. అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగ మండే ఎండలతో సెగలు పుట్టిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే.. నడివేసవిలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు విపరీతమైన ఎండ ఉంటోంది. అక్కడ నుంచి పొగ మంచు ప్రారంభం అవుతోంది. ఆపై రాత్రంతా చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉంది. అక్కడి నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు చూస్తే ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో వేసవి పై ఇప్పటి నుంచే ఆందోళన ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
* ఈ ఏడాది చలి తీవ్రత అధికం
ఈ ఏడాది చలి( winter) తీవ్రత కూడా అధికంగా కనిపించింది. చలి గజ గజ వణికించింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గుముఖం పట్టాయి. మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ప్రజలు వణికిపోయారు. దీనికి తోడు పొగ మంచు విపరీతంగా పడడంతో సాయంత్రం, ఉదయం పూటల్లో ప్రయాణాలు కూడా మానుకున్నారు. అయితే ఒకవైపు చలి తీవ్రత కొనసాగుతుండగానే.. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికంగా నమోదవుతున్నాయి. గత ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
* అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు
రథసప్తమి ( Ratha Saptami) నుంచి ఎండల తీవ్రత పెరగడం సర్వసాధారణం. కానీ రథసప్తమి పర్వదినానికి ముందు నుంచి భానుడు ప్రతాపం చూపడం ప్రారంభించాడు. ఫిబ్రవరి రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా కర్నూలు, కాకినాడ, మచిలీపట్నం, తుని తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలుస్తోంది. మూడు నుంచి ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు, రాయలసీమలో రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
* మానవ తప్పిదాలే కారణం
అయితే ఎండల( hit) తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు పెరగడానికి.. సముద్ర జలాలు కలుషితం కావడమే ప్రధాన కారణమని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సముద్రాలు 30% కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. కానీ సముద్రాలు కూడా కలుషితం కావడంతో ఆ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ వాయువులపై పడుతోంది. వీటి కారణంగానే యాట రికార్డు స్థాయిలో వేడి పెరుగుతోంది. మరోవైపు బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగడం కూడా ఎండల తీవ్రతకు కారణం. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.