Jenasena Leader Kiran Royal
Kiran Royal : గత రెండు మూడు రోజులుగా జనసేన( janasena ) నేత కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో జనసేన నాయకత్వం స్పందించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఓ మహిళా తనను మోసం చేసి కోటి రూపాయలకు పైగా డబ్బులు తీసుకున్నారని.. బంగారాన్ని సైతం తన వద్ద తీసుకోవడంతో తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దానికి సంబంధించి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఇది సంచలనానికి కారణమైంది. అయితే ఆమె ఆ ఒక్క వీడియోకి పరిమితం కాలేదు. వరుస పెట్టి వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు వెనుక వైసీపీ హస్తం ఉందని కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందే కిరణ్ రాయల్ వ్యవహరించిన తీరును తాజాగా బయటపెట్టారు బాధిత మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
* ఎన్నికలకు ముందు అలా
తన వద్ద నుంచి కోటి 20 లక్షలు.. 25 సవర్ల బంగారం తీసుకున్నట్లు సదరు మహిళ చెబుతున్నారు. అయితే తన పిల్లలు వద్దని వారించడంతో.. అప్పట్లో కిరణ్ రాయల్( Kiran Royal ) సెటిల్మెంట్ కోసం వచ్చినట్లు నాటి సంగతులను గుర్తు చేస్తున్నారు బాధితురాలు. ఈ విషయాన్ని బయట పెడితే తన పొలిటికల్ కెరీర్ కు నష్టం జరుగుతుందని.. తన పదేళ్ల కృషి పనికి రాకుండా పోతుందని.. అందుకే ఇక్కడితో ఈ వివాదాన్ని ముగించాలని సెటిల్మెంట్కు దిగినట్లు చెబుతున్నారు. తనకు 30 లక్షల నగదు ఇస్తానని చెప్పారని.. తీ రా ఎన్నికల తరువాత బెదిరింపులకు దిగుతున్నారని.. తన పిల్లలను సైతం చంపేస్తానని హెచ్చరించారని.. అందుకే వీడియోలను బయట పెట్టాల్సి వచ్చిందని బాధిత మహిళ చెబుతున్నారు. తన వెనుక ఎవరూ లేరని.. తనకు అన్యాయం జరిగిందని.. వీధిన పడ్డానని.. మరో మార్గం లేక వీడియోలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు బాధిత మహిళ.
* వేటు వేసిన పార్టీ
మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జనసేన నాయకత్వం( janasena high command) . కిరణ్ రాయల్ పై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అంతవరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. జనసేనలో కిరణ్ రాయల్ బలమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. పొత్తులో భాగంగా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారని టాక్ కూడా నడిచింది. లేకుంటే కిరణ్ రాయల్ కు అవకాశం ఇస్తారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది.
* చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా
అయితే వైసీపీకి( YSR Congress ) వ్యతిరేకంగా కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేసేవారు. జనసేన బలాన్ని చాటి చెప్పేవారు. చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా ఎదుగుతున్నారు. అందుకే తనకు వ్యతిరేకంగా వైసిపి కుట్ర చేసిందని ఆయన భావిస్తున్నారు. పాత వీడియోలను మార్ఫింగ్ చేసి చూపించారని.. ఇందులో తన తప్పు లేదని వాదిస్తున్నారు. అయితే తప్పు చేసింది కిరణ్ రాయల్ అని.. ఆ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపులకు సైతం దిగుతున్నారని బాధిత మహిళలు చెబుతున్నారు. దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్లో కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.