TTD Trust Board : తిరుపతి( Tirupati) తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది. వైకుంఠ ద్వార దర్శనాల తర్వాత మరో ఇద్దరు అధికారులపై వేటు తప్పదని స్పష్టమవుతోంది. ఈ ఘటన తర్వాత సీఎం చంద్రబాబు తిరుమలలో సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. టీటీడీ ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేశారు. అయితే సీఎం సమక్షంలోనే చైర్మన్, ఈవో మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు హెచ్చరించారు. బాధ్యతారాహిత్యం పై సహించేది లేదని స్పష్టం చేశారు. ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేశారు. మరో పది రోజుల్లో కీలక శాఖ అధికారుల స్థానచలనం తప్పదని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ సైతం తిరుమలలో సందర్శించారు. భద్రత వైఫల్యాలను ఎత్తిచూపారు. తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ తరుణంలో టీటీడీ పాలకమండలి అత్యవసరంగా నేడు సమావేశం కానుంది.
* విఐపి కల్చర్ తగ్గాలి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) టీటీడీలో వీఐపీ సంస్కృతి( VIP culture) పై మాట్లాడారు. వీలైనంతవరకు ప్రముఖుల దర్శనాలను తగ్గించాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు జరగనుంది. ప్రధానంగా పవన్ సూచనలపై చర్చించనున్నారు. ఈ ఘటనలో మరణించిన భక్తుల ఇళ్లకు పాలకమండలి సభ్యులు వెళ్లాలని.. పరిహారం చెక్కులు అందించాలని.. క్షమాపణలను కోరాలని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో దీనిపై ఈరోజు అత్యవసర సమావేశం కానుంది టీటీడీ ట్రస్ట్ బోర్డ్. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ సూచనలను సైతం పరిగణలోకి తీసుకున్నారు. వీటినే ప్రధాన అజెండాగా చేసుకుని ఈరోజు చర్చించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారు చేసే అంశంపై చర్చిస్తారు. శనివారం ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకు వెళ్లి ఈ చెక్కులను అందించేందుకు నిర్ణయించారు.
* ప్రముఖుల తాకిడి
అయితే పవన్( Pawan Kalyan) కీలక సూచన అయిన వీఐపీ సంస్కృతి ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భారీగా వీఐపీలు తిరుమల వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. అయితే ప్రముఖులుగా భావిస్తున్న రాందేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ( bandaru Dattatreya ), తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
* ఏపీ నేతలు కూడా
ఏపీకి చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjrapur Ram Mohan Naidu) , హోం మంత్రి వంగలపూడి అనిత, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మహిళా మంత్రులు సంధ్యారాణి, సవిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బిజెపి ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ బిజెపి ఎంపీ డీకే అరుణ, ఏపీ రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, సినీ ప్రముఖులు బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చాముండేశ్వరి నాథ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ విఐపి సంస్కృతి వద్దు అని చెప్పిన కొద్ది గంటల్లోనే ప్రముఖులకు దర్శనం కల్పించడం విశేషం.