Kolusu Parthasarathi : ఏపీలో( Andhra Pradesh) ఓ క్యాబినెట్ మంత్రికి వైసిపి ముసుగు వీడడం లేదు. ఈ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టిడిపిలోకి వచ్చారు. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అంతవరకు ఓకే కానీ సదరు మంత్రి ఇప్పటికీ వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. అధికార పార్టీలో వ్యతిరేకులు మాత్రం ఆయనపై అదే ముద్ర వేస్తున్నారు. దీంతో ఆయనకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే.. కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి( kolusu parthasarathi). ఈ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వరుసగా ఆయన వివాదాల్లో కూరుకు పోతున్నారు. మొన్న ఆ మధ్యన మాజీ మంత్రి జోగి రమేష్ తో( Jogi Ramesh ) వేదిక పంచుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై టిడిపి హై కమాండ్ సీరియస్ అవడంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన కీలక నేతల అనుచరులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
* ఆ ఇద్దరి నేతలతో
వైసిపి ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నాని( Kodali Nani ), వల్లభనేని వంశీ( vallabhanani Vamsi ). గత ఐదేళ్లుగా టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకు పడేవారు. వ్యక్తిగతంగా కామెంట్లు చేసేవారు. చివరకు కుటుంబంపై కూడా సంచలన ఆరోపణలు చేసేవారు. ఆ ఇద్దరు నేతలపై టిడిపి శ్రేణులకు ఓ రేంజ్ లో ఆగ్రహం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరు నేతలు అజ్ఞాతంలో ఉన్నారు. అటు సొంత నియోజకవర్గాల్లో సైతం కనిపించడం లేదు. కానీ ఆ నేతల అనుచరులకు కొలుసు పార్థసారథి ప్రోత్సాహం అందిస్తున్నారన్నది తాజా ఆరోపణలు. ప్రధానంగా కొడాలి నాని అనుచరులకు నూజివీడులో మైనింగ్ కాంట్రాక్ట్ ఇప్పించారన్నది పార్థసారధి పై వస్తున్న ఆరోపణ. అయితే ఈ ఆరోపణలు సంధించింది అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. దీంతో ఇది సంచలన అంశంగా మారిపోయింది.
* జోగి రమేష్ తో వేదిక
మొన్న ఆ మధ్యన నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న( Sardaar gautu lanchana) విగ్రహ ఆవిష్కరణ జరిగింది. సొంత నియోజకవర్గం కావడంతో కొలుసు పార్థసారథి నేతృత్వం వహించాల్సి వచ్చింది. కార్యక్రమానికి గౌతు లచ్చన్న మనుమరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. అలాగే టిడిపి సీనియర్ నేత కొనకళ్ళ నారాయణరావు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ ముగ్గురు నేతలతో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. ఇది పెను దుమారానికి దారితీసింది. చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేసిన జోగి రమేష్ తో వేదిక ఎలా పంచుకుంటారని టిడిపి మీడియాతో పాటు ఆ పార్టీ శ్రేణులు ఈ ముగ్గురు నేతలపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. టిడిపి హై కమాండ్ ఆదేశాలకు విరుద్ధంగా ఏ పని జరగదని… మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూసుకుంటానని పార్థసారథి మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.
*కొడాలి అనుచరులకు మైనింగ్ కాంట్రాక్ట్
అయితే ఈ ఘటన మరువక ముందే నూజివీడులో కొడాలి నాని అనుచరులకు మైనింగ్ కాంట్రాక్ట్( mining contract ) అప్పగించారన్నది కొలుసు పార్థసారథి పై ఉన్న ఆరోపణ. దీనినే హైలెట్ చేస్తున్నారు యార్లగడ్డ వెంకట్రావు. కొడాలి నానితోపాటు వల్లభనేని వంశీ పై గట్టి పోరాటానికి దిగారు యార్లగడ్డ. అయితే గతంలో వైసీపీలో పని చేశారు పార్థసారథి. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇప్పుడు టిడిపిలోకి వచ్చి నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే పూర్వ స్నేహంతో కొడాలి నాని అనుచరులు పార్థసారధి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. వారికి మైనింగ్ కాంట్రాక్టు అప్పగించడం ఏంటని యార్లగడ్డ ప్రశ్నిస్తున్నారు. అయితే వైసిపి నేతలు ఎవరూ ఇక్కడ మైనింగ్ చేయడం లేదని పార్థసారథి అనుచరులు చెబుతున్నారు. దీంతో ఈ వివాదంలో అనవసరంగా పార్థసారధి చిక్కుకున్నట్లు అయింది. అయితే దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తానని యార్లగడ్డ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ కొత్త వివాదం కృష్ణాజిల్లా టిడిపిలో పెను దుమారానికి దారితీస్తోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎలా మారబోతున్నాయో చూడాలి.