Nellore : ఒడిశా రైలు ప్రమాదం యావత్ భారతావనని కలచివేసింది. సాంకేతిక సమస్య కారణంగా జరిగిన ప్రమాదంలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రైల్వేశాఖకు ఒక మాయని మచ్చ. అత్యంత భారీ ప్రమాదాల్లో ఇది ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ రైల్వేకు ఇదో గుణపాఠంలాంటిది. అందుకే దీనిని రైల్వే ఉద్యోగులు సవాల్ గా తీసుకున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ఓ ఘటనలో ఓ రైలు లోకో పైలెట్ చూపిన సాహసం తెలిసిన వారు అభినందించక మానరు.
చెన్నై, న్యూ ఢిల్లీ సూపర్ ఫాస్ట్ రైలు అది. ఈ నెల 22న చెన్నైలో బయలుదేరిన రైలు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ వద్దకు చేరుకుంది. సరిగ్గా కళింగ నది వంతెనపైకి వచ్చేసరికి సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దాని సరిచేసే బాధ్యత టెక్నికల్ టీమ్ ది. కానీ వంతెనపై ఎటువంటి ఫుట్ పాత్ లు లేవు. దీంతో క్లిష్ట సమస్యగా మారిపోయింది. బోగీ దిగువనుండే ప్రాంతంలో వ్యాక్యూమ్ సరిచేయాలి. ఐసోలేషన్ కాక్ ను లాక్ చేయాలి. కానీ అలా చేసేందుకు వెళ్లాలంటే కచ్చితంగా వంతెనపైకి వెళ్లాలి. అది రిస్కుతో కూడుకున్న పని కావడంతో టెక్నికల్ టీమ్ ఆ సాహసం చేయడానికి వెనుకడుగు వేసింది.
రైలులో వందలాది మంది ప్రయాణికులు. ఆపై వంతెన మధ్యలో నిలిచిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో లోకో పైలెట్ ఫణికుమార్ అతిపెద్ద సాహసానికి దిగారు. ఇంజన్ నుంచి అతి కష్టమ్మీద సమస్య ఉన్న బోగీ వద్దకు చేరుకున్నారు. బోగి ఫుట్ బోర్డు మెట్లు, హ్యాండిల్ కు తలకిందులుగా వేలాడుతూ వ్యాక్యూమ్ ను సరిచేశారు. సరిగ్గా 15 నిమిషాల్లో ఐసోలేషన్ కాక్ ను లాక్ చేయగలిగారు. అయితే ఈ క్రమంలో ఏమాత్రం కాలుజారిన నదిలో పడిపోవాల్సిందే. కానీ ఫణికుమార్ చాకచాక్యంగా వ్యవహరించారు. దీంతో ఫణికుమార్ సాహసాన్ని రైల్వే ఉన్నతాధికారులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పాడ్ అవార్డును ప్రకటించారు. అక్కడికక్కడే అందజేశారు.