YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత జగన్( Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల కిందటే ఆయన కీలక ప్రకటన చేశారు. ఇకనుంచి జిల్లాల పర్యటన చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీకి చేరుకోనున్నారు. ఇంతలోనే ఆయన జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వారానికి మూడు రోజులు పాటు పర్యటన చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే షెడ్యూల్ కు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై పోరుబాటను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్ లో చిన్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రధానానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అటు నుంచి వచ్చిన వెంటనే జిల్లాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ తయారీలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు.
* దారుణ పరాజయంతో
ఎన్నికల్లో వైసీపీ( YSR Congress) దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు కూడా ఆ పార్టీకి. ఇటువంటి తరుణంలో చాలామంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యం లేకుండా పోతోంది. అందుకే వారిలో ధైర్యం నింపేందుకు… కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు జగన్. అయితే అంతకంటే ముందే పార్టీ కార్యవర్గాలను నియమించనున్నారు. పెండింగ్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలను ప్రకటించనున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగట్టాలని భావిస్తున్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై జనవరి 3న పోరుబాట నిర్వహించాలని భావించారు. అయితే దానిని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* ఉత్తరాంధ్ర నుంచి మొదలు
అయితే జగన్( Jagan Mohan Reddy) జిల్లాల పర్యటనకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వారానికి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు రోజులు పాటు గడపనున్నారు జగన్. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే తోలుత శ్రీకాకుళం నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ప్రతి బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఆయా నియోజకవర్గ నాయకులతో జగన్ సమావేశం అవుతారు. క్యాడర్ తో సైతం భేటీ అవుతారు. వారి నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. విలువైన సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వీలుగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
* గతానికి భిన్నంగా పర్యటనలు
అయితే గతానికి భిన్నంగా జగన్( Jagan Mohan Reddy) జిల్లాల పర్యటనలు కొనసాగే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో నాయకులు పూర్తిగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అటువంటి చోట కొత్త నియామకాలు చేపట్టనున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను హైలెట్ చేయనున్నారు. వాటి పరిష్కార మార్గం పై ప్రభుత్వం పై ఒత్తిడి చేయనున్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తానికి అయితే వైసీపీ అధినేత జగన్ పోరుబాట పట్టనుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన సందడి నెలకొంది.