Annadata Sukhi Bhava : ఎన్నికల హామీలపై కూటమి ప్రభుత్వం( Alliance government) ఫోకస్ పెట్టింది. ప్రధానంగా రైతు భరోసా పథకాన్ని( raithu Bharosa scheme) అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. పథకానికి సంబంధించి అర్హత ఉన్న రైతులు ఎంతమంది? ఎంత మొత్తంలో అందించాలి? అన్నదానిపై అధ్యయనం పూర్తి చేసింది. 2019లో నవరత్నాల్లో భాగంగా జగన్ సర్కార్ వైయస్సార్ రైతు భరోసా ను ప్రకటించింది. ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద పదిహేను వేల రూపాయల మొత్తాన్ని అందిస్తామని చెప్పుకొచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత 7500 రూపాయలు ఇచ్చేందుకు మాత్రమే మొగ్గుచూపింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ 6000 రూపాయలు మొత్తం తో కలిపి.. 13 వేల రూపాయల 500 అందించింది. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా ఇంతవరకు సాయం అందించలేదు. రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
* తొలుత పోర్టల్ మార్పిడి
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా( raithu Bharosa ) పేరిట ఉన్న పథకం పోర్టల్ ను.. అన్నదాత సుఖీభవ గా మార్చారు. అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ఈ నగదు అందిస్తారని రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కేంద్రం అందించే పిఎం కిసాన్ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడత 2000 రూపాయలు చొప్పున ఫిబ్రవరిలో అందించనున్నారు. అయితే అన్నదాత సుఖీభవ కు సంబంధించి కూడా అప్పుడే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి నిధులు సమీకరణలో పడింది. ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రధాన ఎన్నికల హామీకి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.
* పీఎం కిసాన్ తో కలిపి
వాస్తవానికి సంక్రాంతి( Pongal) నాటికి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ ఎందుకో జాప్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది. అయితే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేయనుంది. సచివాలయాల వారీగా జాబితాలను రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే విపక్షాలు రైతు భరోసా పథకం పై టార్గెట్ చేశాయి. అటు జగన్ సైతం జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి విమర్శలు రాకుండా చూసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
* జూన్ లో తల్లికి వందనం
మరోవైపు తల్లికి వందనం( thalliki Vandanam ) పథకానికి అప్పుడే నిధుల సమీకరణ మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎట్టి పరిస్థితుల్లో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని భావిస్తోంది. వైసిపి హయాంలో అమ్మఒడి పేరిట పథకాన్ని అమలు చేశారు. ఇంట్లో ఒక పిల్లాడి చదువుకి అవసరమైన 15 వేల రూపాయల మొత్తాన్ని అందించాలని నిర్ణయించారు. అయితే తొలి ఏడాది పాఠశాల నిర్వహణ కింద అందులో 1000 రూపాయలను కోత విధించారు. అటు తరువాత రెండు వేల రూపాయలను కట్ చేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 20వేల రూపాయల చొప్పున అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకం అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ పథకానికి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అందుకే నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ రెండు పథకాలు అమలు జరిగితే ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడుతుందని కూటమి సర్కార్ భావిస్తోంది.