Kiran Abbavaram
Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం, అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈయన ‘క’ అనే చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్న తర్వాత విడుదలైన మొట్టమొదటి చిత్రమిది. వీళ్లిద్దరి పెళ్ళైన వేళావిశేషం కిరణ్ అబ్బవరం కి అద్భుతంగా కలిసొచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో నేడు మరో శుభవార్త ని పంచుకున్నాడు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నాని సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంటూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ‘మై ప్రేమ రెండు అడుగులు పెరిగింది’ అంటూ తన భార్య తో కలిసి ఉన్న ఫోటోని ఆయన అప్లోడ్ చేసాడు.
వీళ్లిద్దరి పెళ్లి గత ఏడాది ఆగష్టు 22 న కర్ణాటక లో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. పెళ్లి జరిగి 6 నెలలు కూడా పూర్తి కాకముందే ఈ శుభవార్త చెప్పడం ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా వాళ్లంతా కిరణ్ అబ్బవరం కి శుభాకాంక్షలు తెలియచేసారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ కలిసి ‘రాజా వారు..రాణి వారు’ అనే చిత్రాన్ని చేశారు. ఇదే వీళ్లిద్దరికీ మొదటి చిత్రం. కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ళు డేటింగ్ చేసి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూస్తే ఏ జంటకి అయినా అసూయ వేయక తప్పదు. వీళ్ళ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్స్ చూస్తే ఎందుకు ఇలా అంటున్నామో అర్థం అవుతుంది.
ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ఆయన ‘క’ చిత్రం సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘దిల్ రుబా’ అనే చిత్రం చేస్తున్నాడు. రెండు వారాల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. విశ్వ కరుణ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని, ఇదే రేంజ్ సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించాలని చూస్తున్నాడు కిరణ్ అబ్బవరం. మరి ఆయన ప్లానింగ్ కి తగ్గట్టుగా వెళ్లి సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.