Temperature: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణంగా మారింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తగ్గడం లేదు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తీవ్ర ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో ఉష్ణోగ్రత పంజా విసురుతోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7°1 ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాదికి ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లు పైకి రావడం లేదు. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, కడప జిల్లా చిన్న చెప్పలి లో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి, అక్కమాంబ పురంలో 47.1% డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాలలో 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ప్రకాశం జిల్లాలో ఎండలు తీవ్రత అధికంగా ఉంది. 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయినట్లు తెలుస్తోంది. నెల్లూరు 37, కడప 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. తిరుపతి 34, శ్రీ సత్యసాయి 32, చిత్తూరు 31, అనంతపురం 31, అన్నమయ్య రాయచోటి 30, నంద్యాల 29, ఏలూరు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. పల్నాడులో 28 మండలాల్లో, విజయనగరం 27, బాపట్ల 25, కృష్ణ 25, కర్నూలు 25, అనకాపల్లి 24, అల్లూరి సీతారామరాజు 22, కోనసీమ 22, కాకినాడలో 21 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంతవరకు బయటకు వెళ్ళకూడదని నిపుణులు సూచిస్తున్నారు.