Attack On Jagan: జగన్ పై దాడి విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రత్యర్ధుల పనేనని అనుమానం వచ్చేలా అనుకూల మీడియా వ్యవహరించింది. కాదు తనకు తాను సొంతంగా చేయించుకున్నారని ఎల్లో మీడియా కథనాలను వండి వార్చింది. రాయి తగులుతున్నప్పటి వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. జగన్ తనకు తానే మైక్ కేసి తలకొట్టేసుకుని రాయి తగిలిందని డ్రామా ఆడుతున్నాడని ఒకరు. బంతి అయితే బౌన్స్ అవుతుంది కానీ.. రాయి వెళ్లి ముందుగా జగన్ కు తగలడం ఏమిటి.. తరువాత వెల్లంపల్లి కి గీసుకోవడం ఏమిటని రకరకాలుగా ప్రశ్నించడం ప్రారంభించారు. మరికొందరైతే దండలు మార్చే సమయంలో పుల్ల గీసుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇన్ని రకాల అనుమానాలతో ఎల్లో మీడియా ప్రజల్లో ఒక రకమైన అయోమయానికి కారణమైంది.
వాస్తవానికి ఇది చంద్రబాబు చేశారని వైసీపీ నేతలు అత్యుత్సాహంతో చెప్పుకొచ్చారు. సింపతి కోసం తనకు తానే చేసుకున్నారని టిడిపి నేతలు ఆరోపించడం ప్రారంభించారు. ఇందులో ఎల్లో మీడియా ప్రవేశించి రక్తి కట్టించింది. రాయి వేసిన వ్యక్తి అన్నా క్యాంటీన్ ఎత్తివేసినందుకు జగన్ పై కోపంగా ఉన్నాడని బోండా ఉమా చెప్పినట్లు వార్త ప్రచురించింది. అంటే ఆ వ్యక్తి ఉమాకు తెలిసినవాడే అనుకోవాలా? తెలియకపోతే అతను ఏ ఉద్దేశంతో రాయి వేశాడో ఉమా ఎందుకు చెప్పినట్టు? అక్కడితో ఎల్లో మీడియా వార్తలు ఆగలేదు. రాయి వేసిన వ్యక్తి వైసీపీ వాడేనని.. డబ్బు, మందు అందక కోపంతో రాయితో కొట్టాడని చెప్పుకొచ్చారు.
జగన్ పై దాడి పై వైసీపీ నేతలు అత్యుత్సాహంతో స్పందించారు. అదే సమయంలో ఎల్లో మీడియా అతిగా స్పందించి టిడిపి పై అనుమానాలను మరింత పెంచింది. వాస్తవానికి చంద్రబాబు ఈ పని చేసి ఉంటారా? అది నమ్మశక్యమేనా? కానీ టిడిపి తో పాటు చంద్రబాబుపై అనుమానం పెంచేలా ఎల్లో మీడియా ప్రవర్తించింది. సంచలన అంశంగా మారిపోయింది. ప్రస్తుతం సురేష్ అనే యువకుడిని పట్టుకోవడం, ఆయన తండ్రి బోండా ఉమా అనుచరుడని తెలియడం, అటు బోండా ఉమా సైతం అతిగా స్పందించడం, బోండా పై గులకరాయి కేసు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎత్తిచూపడం.. ఇవన్నీ టిడిపిపై అనుమానాలకు కారణం అయ్యాయి.