VijayaSai Reddy : విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) సడన్ గా రాజీనామా చేయడానికి కారణాలేంటి? దీని వెనుక వైసిపి వ్యూహం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. కానీ అంతకుమించి విజయసాయి రెడ్డికి వైసీపీలో చాలా అవమానాలు జరిగినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడుగా ఉంటూ వచ్చారు విజయసాయి. జగన్తో పార్టీ కేసులను ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. వైసిపి ఏర్పాటు చేయడంలో కీలక భాగస్వామిలయ్యారు. వైసీపీని అధికారంలోకి తేవడంలో కూడా విజయసాయిరెడ్డి ఎంతగానో కృషి చేశారు. అందుకే వైసిపి నుంచి తొలి రాజ్యసభ పదవిని విజయసాయిరెడ్డికి జగన్ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అయితే అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీని విడిచిపెట్టి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు షాక్ తో ఉన్నారు. అసలు విజయసాయిరెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్లడానికి కారణం ఏంటన్నది వారికి సైతం అంతు పట్టడం లేదు.
* వైసీపీ ఆవిర్భావం నుంచి
వైసిపి( YSR Congress) ఆవిర్భావం నుంచి అనుబంధ విభాగాలన్నీ విజయసాయిరెడ్డి కంట్రోల్లో ఉండేవి. ముఖ్యంగా పార్టీ సోషల్ మీడియా వింగ్ సాయి రెడ్డి కనుసన్నల్లో నడిచేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో విభాగం విజయసాయిరెడ్డి నుండి దూరం అవుతూ వచ్చింది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ తర్వాత సీన్ మారింది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది. విజయసాయి రెడ్డి వద్ద ఉన్న సోషల్ మీడియా వింగ్ ను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ని పంపించారు. అయితే ఆయనపై అదే పనిగా సొంత పార్టీ శ్రేణులే అధినేతకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. ఆ స్థానంలో వైవి సుబ్బారెడ్డి కి నియమించారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డిని పంపించారు. కానీ అక్కడ ఆయనకు అడుగడుగునా అవమానాలు ఎదురైనట్లు తెలుస్తోంది.
* ఉత్తరాంధ్ర పరిణామాలు
ఇటీవల ఉత్తరాంధ్రలో( North Andhra ) వరుస పరిణామాలు జరిగాయి. ప్రధానంగా బొత్స కుటుంబ పెత్తనం పెరిగింది. ఎన్నికల్లో బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయితే ఫలితాలు వచ్చిన అనంతరం బొత్స సత్యనారాయణ ను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇటీవల బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. చోడవరంలో కరణం ధర్మశ్రీని తప్పించారు. చోడవరం బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇచ్చారు. కానీ కనీస సమాచారం విజయసాయి రెడ్డికి ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా ఉత్తరాంధ్రలో ఐపాక్ టీం విజయసాయిరెడ్డిని అస్సలు లెక్క చేయడం లేదట. ఈ పరిణామాలన్నీ విజయసాయిరెడ్డి లో ఒక రకమైన అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
* చెవిరెడ్డి నుంచి సవాళ్లు
మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( Chevi Reddy Bhaskar Reddy )నుంచి అనేక రకాల సవాలను ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి. గత కొన్నేళ్లుగా పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించారు భాస్కర్ రెడ్డి. దీంతో విజయసాయి రెడ్డి వద్ద ఉన్న అనుబంధ విభాగాల బాధ్యతలను భాస్కర్ రెడ్డికి కట్టబెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే సజ్జల రూపంలో ఇబ్బందులు పడ్డారు. వై వి సుబ్బారెడ్డి సైతం ఆధిపత్యం ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా వారి సరసన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరారు. ఉత్తరాంధ్రలో బొత్స తో పాటు ఐపాక్.. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ ముగ్గురు.. ఇలా తాను కష్టపడి పార్టీ కోసం పని చేస్తే.. వీరి పెత్తనాన్ని సహించలేకపోయారు విజయసాయిరెడ్డి. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.