PM Narendra Modi
PM Narender Modi : విశాఖలో( Visakhapatnam) ప్రధాని పర్యటన విజయవంతంగా పూర్తయింది. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోడీ ( Narendra Modi)శ్రీకారం చుట్టారు. అంతకుముందు నగరంలో భారీ రోడ్ షో( road show) నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. కానీ ఎక్కడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకుండా పోయింది. దీంతో కార్మిక, ఉద్యోగ వర్గాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు మాట దేవుడెరుగు.. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను మాత్రం ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు కార్మిక వర్గాలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ చేసిన కామెంట్స్, ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు.
* ఏడాదిన్నరగా ఆందోళనలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను( Visakha steel plant) ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. అప్పటినుంచి కార్మికులతో పాటు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో దీనిపై స్పష్టతనిస్తారని అంతా భావించారు. కానీ ప్రధాని తన సుదీర్ఘ ప్రసంగంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం కార్మిక వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. కూటమిలో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు( Chandrababu) ఎలాగైనా ప్రధాని మోదీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెప్పిస్తారని కార్మికులు ఎంతగానో ఆశించారు. కానీ అటువంటిదేమీ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయంలో పవన్ తీరును విపరీతంగా ఆక్షేపిస్తున్నారు.
* వైసిపి హయాంలో
వైసిపి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్( Visakha steel plant ) ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కార్మికులు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ స్పందించారు. కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పు పట్టకుండా.. వైసిపి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. వైసిపి తీరుతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని.. అవసరమైతే తమ గళాన్ని వినిపిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). కానీ నిన్న జరిగిన సభలో కనీసం విశాఖ స్టీల్ ప్రస్తావన లేకుండా ప్రధాని ప్రసంగం ముగించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు విశాఖ నగర ప్రజలు, ఉత్తరాంధ్రవాసులు.
* మరో ప్లాంట్ పై ఆందోళన అనకాపల్లి( Anakapalli) ప్రాంతంలో మరో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడంపై కూడా కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను( Visakha steel plant ) నిర్వీర్యం చేసేందుకే ఈ ప్రాంతంలో మరో ప్రైవేటు స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది బలిదానాలతో నిర్మించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతున్నారు. నిత్యం చంద్రబాబు భజన తోనే పవన్ సరిపెడుతున్నారని.. కనీసం విశాఖ స్టీల్ అంశాన్ని ప్రధానితో చెప్పించలేకపోయారని తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పవన్ పై ముప్పేట విమర్శలకు దిగుతున్నారు.