Kota Vinutha Offer: సూక్ష్మ పరిమాణంలో ఉండే చీమ… భారీగా ఉండే ఏనుగు.. గొప్పగా ఆలోచించే మనిషి.. ఎవరిదైనా ప్రాణమే. ఆ ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే.. ఆ ప్రాణం గాలిలో కలిసిపోతే తిరిగి తీసుకురావడం కష్టం. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితేనే చాలా బాధపడిపోతాం.. ప్రాణం పోయిందని కన్నీరు పెడతాం. మనుషులే కాదు జంతువులు కూడా తమ తోటి జంతువుల ప్రాణాలు పోతే కన్నీరు పెడతాయి. గుండెలు అవిసే విధంగా రోదిస్తుంటాయి. ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతేనే అలా ఉంటే.. కావాలని ప్రాణాలు తీస్తే ఎలా ఉంటుంది.. ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తి బాధ ఎలా ఉంటుంది? వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుంది? అలాంటి కష్టం పగవారికి కూడా రావద్దు అనిపిస్తుంది కదా..
నమ్మిన పాపానికి.. ఇన్ని సంవత్సరాలపాటు నమ్మిన బంటుగా ఉన్న పాపానికి రాయుడు అనే యువకుడిని శ్రీకాళహస్తి గ్లాస్ పార్టీ మాజీ ఇంచార్జ్ కోట వినూత, ఆమె భర్త, ఇంకా కొంతమంది వ్యక్తులు అంతం చేశారు.. అంతేకాదు అతడి మృతదేహాన్ని చెన్నైలో పడేశారు. అతడిని అంతం చేసిన తర్వాత ఏదో ఘనకార్యం చేసినట్టు వినూత, ఆమె భర్త భారీ వాహన శ్రేణి మధ్య సొంత ప్రాంతానికి వచ్చారు. శ్రీనివాస రాయుడు చేతి మీద ఉన్న పచ్చబొట్టు ఆధారంగా చెన్నై పోలీసులు ఈ కేసును చేదించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వినూత, ఆమె భర్త, ఇతర నిందితులు ఉన్నారు. పోలీసుల విచారణలో వారు చెబుతున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. పనిలో పనిగా ఫ్యాన్ పార్టీ అనుకూల మీడియా మరిన్ని విషయాలను రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే శ్రీనివాసరాయుడు సోదరి, నానమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని కీలక విషయాలను రాబట్టింది.
Also Read: Political Crime Case: ‘రసిక’ రాజకీయం..
శ్రీనివాస రాయుడు సోదరిని పోలీసులు విచారణ నిమిత్తం పిలిచారు. పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె స్పష్టంగా సమాధానం చెప్పింది. తన వద్ద ఉన్న ఆధారాలు కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో పోలీసుల విచారణ అనంతరం బయటికి వచ్చిన ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది..” శ్రీనివాస రాయుడిని అంతం చేసిన తర్వాత ఈ విషయం మాకు తెలిసింది. మాకు కోట వినూత నుంచి ఫోన్ వచ్చింది. 30 లక్షలు ఇస్తాం.. ఈ విషయాన్ని మర్చిపో అన్నారు. దానికి మేము లొంగలేదు. మాకు డబ్బు అవసరం లేదు. వినుత చెప్పినట్టు మా సోదరుడు ప్రత్యర్థి పార్టీ వద్ద డబ్బు తీసుకొని ఉంటే.. అది ఎక్కడికి వెళ్ళింది? ఆ డబ్బు ఏ ఖాతాలో ఉంది? ఒకవేళ ఆయన డబ్బు ఇస్తే ఏ రూపంలో ఇచ్చాడు? ఇవన్నీ మాకు తెలియాలి. మా విషయంలో పవన్ కళ్యాణ్ జ్యోక్యం చేసుకోవాలి. న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. మేము న్యాయం కోసం మాత్రమే పోరాడుతున్నాం.. సోదరుడి ప్రాణానికి వెల కడుతున్నారు. ఇటువంటి పద్ధతి మంచిది కాదని” శ్రీనివాస రాయుడు సోదరి విలేకరులతో పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో వినూత, ఆమె భర్త మరింత ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తోంది.