AP Surveys: విభజన హామీలు అమలుకాలేదు. పోలవరం లేదు. ప్రత్యేక హోదా మాట వినిపించడం లేదు. రాజధాని కొలిక్కి రాలేదు. అభివృద్ధి జాడలేదు. అయినా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. హౌ ఇట్ ఈజ్ పాజిబుల్? ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట ఇదే. చివరకు వైసీపీ నేతలు సైతం అనుమానిస్తున్నారు. ఇదేలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఇది అతిగా ఊహించుకోవడమేనని భావిస్తున్నారు. వాస్తవానికి దూరంగా ఉందని చెబుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఫేక్ సర్వే అని నిర్ధారిస్తున్నారు. టైమ్స్ నౌ లాంటి జాతీయ సంస్థ ఎందుకు పనిగట్టుకొని సర్వే చేస్తోందని.. దీని వెనుక ఏదో ఒక గూడు పుఠాని ఉందని భావిస్తున్నవారూ ఉన్నారు. కేవలం సంక్షేమ పథకాలతో ఏకపక్ష విజయం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. . అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ప్రచారంతో హోరెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని తేల్చిచెబుతోంది.
పోల్ మేనేజ్ మెంట్ లో భేష్…
అయితే గత ఎన్నికల ముందు నుంచి జగన్ పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆరితేరారు. అటు ప్రశాంత్ కిశోర్ రూపంలో వ్యూహకర్త దొరకడం కూడా జగన్ కలిసొచ్చింది. గతంతో టీడీపీ చేసిన తప్పును అనుసరించకూడదని భావించారు. నాడు బీజేపీని దూరం చేసుకొని చంద్రబాబు ఏరికోరి కష్టాలు తెచ్చకున్నారు. వైసీపీ ట్రాప్ లో పడి చేజేతులా కేంద్రాన్ని దూరం చేసుకున్నారు. అందుకే అటువంటి తప్పు జరగకుండా జగన్ జాగ్రత్తపడ్డారు. ఎన్నిరకాల ఇబ్బందులు వచ్చినా బీజేపీని వదులుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నప్రచారం నేపథ్యంలో ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి కేంద్రానికి ఇబ్బందులు కలిగించే వాటి జోలికి పోవడం లేదు.
ముందుచూపుతో..
జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లకపోయినా.. అక్కడ తన ప్రభావం ఉండేలా జగన్ వ్యూహం పన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీతో దోస్తీ కొనసాగాలంటే తమపై సానుకూల ప్రభావం ఉండాలని భావించారు. అందుకే టైమ్స్ నౌ ఈటీజీ మాతృక అయిన ‘బెనెట్ కోల్ మన్ అండ్ కో’తో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకుల ఇమేజ్ పెంచడం ఈ సంస్థ పని దీనికిగాను ఏడాదికి రూ.8 కోట్లు చెల్లిస్తూ వస్తున్నారు. గత మూడేళ్లో ముచ్చటగా రూ.25 కోట్లు సమర్పించుకున్నారు. ఉన్న రెండేళ్లలో మరో రూ.16 కోట్లు చెల్లింపునకు సిద్ధపడ్డారు. ఇదంతా జాతీయ స్థాయిలో సఖ్యత కోసమే. అయితే జగన్ రాజకీయాలు ఇప్పుడిప్పుడే బయటనడుతున్నాయి. మున్ముందు ఇవి ఎటు తిరుగుతాయో చూడాలి.
అంతగా ప్రజల్లోకి వెళ్లలే..
జగన్ సర్కారు పాత పథకాలనే పేరు, తీరు మార్చి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయా పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు అందేవి. కానీ, జగన్ సర్కారు ఒకే పథకానికి పలుమార్లు నిధులు విడుదల చేస్తూ… బటన్ నొక్కిన ప్రతిసారీ మీడియాకు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేస్తోంది. ఇలా సొంత మీడియాకే వందల కోట్లు కట్టబెట్టింది. స్థానికంగా ఎంపిక చేసిన పత్రికలతోపాటు జాతీయ స్థాయి పత్రికలు, వెబ్‌సైట్లకూ కోట్ల విలువైన ప్రకటనలు ఇస్తోంది. అలా టైమ్స్ నౌ ఈటీజీ సంస్థకు కూడా ఇతోధికంగా నగదు ముట్టజెప్పిందన్న మాట. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ సంపూర్ణ విజయం పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా అదో విఫల చర్యగా మిగులుతోంది. వైసీపీ వర్గాల ప్రచారానికి మించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఇటువంటి సమయంలో ఎన్నిరకాల సాహసాలు చేసినా వర్కవుట్ కాకపోవడం జగన్ సర్కారుకు మింగుడుపడడం లేదు.