Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీని( Vallabhaneni Vamsi ) రిమాండ్ కు తరలించారు. ఆయన అరెస్టు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే మరో కేసు చూపించి ఇప్పుడు అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. అయితే వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది. ఆయనపై చాలా రకాల కేసులు నమోదు చేసి సుదీర్ఘకాలం జైల్లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి శ్రేణులు ఎక్కువగా చూసింది కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ వైపే. ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయో.. అదేరోజు కౌంటింగ్ కేంద్రం నుంచి ఆ ఇద్దరు నేతలు నడిచి బయటకు వెళ్లిపోవడాన్ని గుర్తించారు టిడిపి శ్రేణులు. అయితే అది మొదలు ఆ ఇద్దరిపై ఎప్పుడు కేసులు నమోదు అవుతాయి? ఎప్పుడు జైల్లో పెడతారు? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు టిడిపి శ్రేణులు. అయితే గత తొమ్మిది నెలలుగా వారి వైఫల్యాలను, లోపాలను గుర్తించిన తరువాతే ఇప్పుడు అరెస్టుల పర్వం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
* అప్పట్లో వ్యక్తిగత విమర్శలు
అయితే వల్లభనేని వంశీ విషయంలో మాత్రం చంద్రబాబుతో( Chandrababu) పాటు లోకేష్ దూకుడుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు వల్లభనేని వంశీ. కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. అయితే రాజకీయ అవసరాలకు ఇలా పార్టీలు మారడం సర్వసాధారణం. కానీ వల్లభనేని వంశీని మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత దాడి చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నారన్న టాక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో వల్లభనేని వంశీ పడడంతోనే తండ్రీ కొడుకుల పై అదే పనిగా దాడి చేశారని ఒక విశ్లేషణ ఉంది. అయితే రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సాధారణం. కానీ వల్లభనేని వంశీ మాత్రం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనినే తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు, లోకేష్. అందుకే వల్లభనేని వంశీని వెంటాడినట్లు తెలుస్తోంది.
* గట్టి కేసులు
అయితే వల్లభనేని వంశీని( Vallabha neni Vamsi ) కొద్ది రోజులపాటు జైల్లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత ఐదేళ్ల వైసిపి పాలనలో గన్నవరంలో మట్టి తవ్వకాల వ్యవహారం ఎక్కువగా నడిచింది. ముఖ్యంగా పోలవరం కాలువ గట్లు తొలచి పెద్ద ఎత్తున మట్టిని తరలించారని వల్లభనేని వంశీ పై ఆరోపణ ఉంది. ఇదే కేసులో ఆయన అనుచరులు సైతం అరెస్టు అయ్యారు. మరోవైపు 2014, 2019 మధ్య గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇంటి పట్టాలు మంజూరు చేశారన్న కేసు కూడా ఆయనపై ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని, ప్రలోభ పెట్టి వల్లభనేని వంశీని వైసీపీలో చేర్పించుకున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే కేసును తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు, టిడిపి కార్యాలయం పై దాడి, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ, భూ దందాలు, సెటిల్మెంట్లు.. ఇలా చాలా రకాల కేసులు తెరపైకి తెచ్చి కొద్ది రోజులపాటు జైల్లోనే ఉంచేలా ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం నడుస్తోంది.
* ఫలితాలు అనంతరం అజ్ఞాతంలోకి
వాస్తవానికి ఎన్నికల ఫలితాల( election results) తరువాత వల్లభనేని వంశీ ఎక్కడ బయటకు కనిపించలేదు. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం నడిచింది. అయితే ఎన్నికలకు ముందు ఆయన అనారోగ్యానికి గురయ్యారు కూడా. ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ వైరాగ్యం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే గత ఐదేళ్లలో వల్లభనేని వంశీ వ్యవహార శైలి ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు వరుసగా మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. వంశీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే వల్లభనేని వంశీ చక్రబంధంలో చిక్కుకున్నట్టే.