Visakhapatnam YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాయలసీమలో సైతం తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో ఏకపక్ష విజయం దక్కించుకుంటామని.. ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు తమవేనని.. గోదావరి తో పాటు దక్షిణ కోస్తాలో సీట్లు తగ్గినా.. టోటల్ గా 100 సీట్లతో అధికారంలోకి వస్తామని వైసిపి భావించింది. కానీ రాయలసీమలో అంచనా తప్పింది. ఉత్తరాంధ్రలో కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయింది వైసిపి. అది కూడా విశాఖ మన్య ప్రాంతంలోని అరకు, పాడేరులో మాత్రమే విజయం సాధించింది. అయితే విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినా అక్కడ ప్రజలు ఆహ్వానించలేదు. కనీసం స్వాగతించలేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా విశాఖ నగరవాసులు ఆ పార్టీకి దూరం పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర వైసీపీని తిరస్కరించింది.
* నగరంలో ఆదరణ లేదు
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోయినా.. ఉత్తరాంధ్ర మాత్రం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అటువంటి చోట వైసిపి 2019 ఎన్నికల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది. 34 సీట్లు ఉన్న ఉత్తరాంధ్రలో.. 2014 ఎన్నికల్లో 9 స్థానాలను గెలుచుకుంది. అదే 2019 ఎన్నికల్లో 28 సీట్లతో ఆధిక్యత కనబరిచింది.ఈ ఎన్నికల్లో మాత్రం తుడుచుపెట్టుకుపోయింది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరం ఆ పార్టీని ఆదరించలేదు.కనీసం దగ్గర చేర్చుకోలేదు.నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో కనీసం గెలుపు అన్నది పలకరించలేదు. ఈ ఎన్నికల్లో 15 స్థానాలకు గాను 13 చోట్ల విశాఖలో విజయం సాధించింది కూటమి.
* పార్టీని వీడుతున్న నేతలు
అయితే ఇప్పుడు వైసీపీకి అసలు కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరాటాన్ని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.దానికి ఒక్కరోజు ముందే మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి తదితరులు వైసీపీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిపోయారు. ఇదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారు. వైసీపీలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో తెలియని పరిస్థితి. ప్రస్తుతం వైసీపీకి వలసనేతలే దిక్కయ్యారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో రాజకీయాలు నడుపుతున్నారు. అదే మాదిరిగా విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ సైతం.. విశాఖ జిల్లా పై ఫోకస్ పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో నాయకులు జారిపోతున్నారు. పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.