https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబును అడ్డంగా ఇలా బుక్ చేస్తున్నారు

గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో వేదికలను పంచుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారు.

Written By: , Updated On : March 9, 2024 / 11:14 AM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu: బిజెపి అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో ఢిల్లీ వెళ్లారు. పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. అయితే ఈ పొత్తు కుదరకూడదని వైసీపీ భావిస్తోంది. చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఇప్పుడు దాదాపు పొత్తు ఖాయమవుతున్న వేళ వైసిపి అనుకూల మీడియా కొత్త ప్రచారానికి తెరతీసింది. గత ఎన్నికలకు ముందు ప్రధానిని టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తోంది. అది పొత్తుపై ప్రభావం చూపడంతో పాటు.. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో ఇబ్బందికర పరిణామంగా మారనుంది. వైసీపీకి కూడా కావాల్సింది అదే.

గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో వేదికలను పంచుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. గోద్రా అల్లర్లలో 2000 మందిని ఆయన పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. నరరూప రాక్షసుడిగా అభివర్ణించారు. అటు తరువాత శాసనసభలో సైతం ప్రధానిని తీవ్ర స్థాయిలో తూలనాడారు. ఇంటా బయటా ప్రధానిని టార్గెట్ చేసుకున్నారు. మరోసారి మోదీని ఎన్నుకుంటే ఈ దేశం సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాడు చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.

ఎన్డీఏలో చేరిక, పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాల్లో చంద్రబాబు బిజీగా ఉండగా.. గతంలో ఆయన చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తుండడం విశేషం. అతి కష్టం మీద చంద్రబాబు బిజెపిని పొత్తుకు ఒప్పించారు. సీట్ల సర్దుబాటు విషయంలో బిజెపి అగ్ర నేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా అనుకున్నది సాధించగలుగుతున్నారు. ఈరోజు పొత్తు పై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా.. నాడు ప్రధాని మోదీని ఆయన టార్గెట్ చేసే విధానాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తున్నాయి. పొత్తు పై ప్రభావం చూపడం, పొత్తు కుదిరినా ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదు అన్నది ప్రణాళికగా తెలుస్తోంది. అయితే దీనిపై టిడిపి అభిమానులు సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. రాజకీయాల అన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయని.. అవి సర్వసాధారణమని.. వాటిని భూతద్దంలో చూపడం తగదని.. బిజెపితో పొత్తును జీర్ణించుకోలేక ఈ తరహా ప్రచారం చేస్తున్నారని టిడిపి అభిమానులు మండిపడుతున్నారు. మొత్తానికైతే పొత్తు ముంగిట చంద్రబాబుకు చికాకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అయితే ఇవి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.