Visakha Railway Zone : రాష్ట్ర విభజన చట్టంలో ప్రధానమైనది విశాఖ రైల్వే జోన్ అంశం. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్న దీనికి మోక్షం కలగడం లేదు. దీనికి సంబంధించిన డిపిఆర్ ను 2019 సెప్టెంబర్ లో రైల్వే బోర్డు ఆమోదించింది. కానీ ఇప్పటివరకు రైల్వే జోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైల్వే జోన్ కోసం కేంద్రం కోరిన భూములు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటే.. అవి వివాదంలో ఉన్నాయని కేంద్రం ఇప్పటివరకు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు ప్రారంభించినట్లు కొద్దిరోజుల కిందట ప్రకటించింది. జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కొద్ది రోజుల్లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన జరుగుతుందని అంతా భావించారు. ఇటువంటి సమయంలో టిడిపికి చెందిన ఎంపీలు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. భవనాలతో సంబంధం లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు.గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ వైసిపి ప్రభుత్వ చర్యలను తప్పు పట్టింది. విశాఖలో రైల్వే జోన్ కు సంబంధించి భవనాలు నిర్మాణం పూర్తయిన తర్వాతే..కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించింది. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
* ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఇలా
తాజాగా ఎల్లో మీడియాలో ఒక కథనం వచ్చింది. విశాఖ రైల్వే జోన్ అంశంపై విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎంతో టిడిపి ఎంపీలు సమావేశం అయినట్లు ఈ వార్త సారాంశం. మరోసారి అధికారులు భవనాలు భూములు చుట్టూ కథలు అల్లారని.. వాటితో పని లేకుండా రైల్వే జోన్ ప్రారంభించాలని ఎంపీలు కోరినట్లు ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చింది. అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇప్పటికిప్పుడు రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించాలని ఎంపీలు కోరినట్లు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. దీనిపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది.
* ప్రతిసారి ఇదే తంతు
వాస్తవానికి విశాఖ రైల్వే జోన్ అంశం ప్రతిసారి రాజకీయ అంశంగా మారిపోతోంది. ప్రత్యేక రైల్వే జోన్ అనేది ఏపీ వాసుల చిరకాల వాంఛ. విభజన హామీల్లో భాగంగా కేంద్రం రైల్వే జోన్ ను ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా పేరు మార్చింది. అయితే ఇంతలో టిడిపి అధికారానికి దూరం కావడం..వైసీపీఅధికారం చేపట్టడం జరిగిపోయింది. కానీ వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు చేయకపోవడంతో రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోయామని కేంద్రం ప్రకటించింది.అంటే టిడిపి కూటమి ప్రభుత్వం భూములు చూపితే రైల్వే జోన్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని కేంద్రం చెప్పినట్టు అయింది.అయితే తాజాగా ఎంపీల అభిప్రాయం చూస్తుంటే..ప్రైవేటు భవనాలను తీసుకొని రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించినట్లు ఉంది. గతంలో ఇదే తరహా వైసిపి ప్రయత్నాలు ఉంటే టిడిపి తప్పు పట్టింది. ఇప్పుడు అదే తప్పు టిడిపి చేస్తోంది. మొత్తానికైతే విశాఖ రైల్వే జోన్ అంశం.. పూర్తిగా రాజకీయ అంశంగా మారిపోయింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The mps of tdp who met with the senior officials of the railway department discussion about the visakha railway zone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com