Vizag MP Family Kidnap Case : విశాఖ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ నకు అసలు కారణమేంటి? డబ్బు కోసమే ఈ పనిచేశారా? ఇతరత్రా కారణలేమైనా ఉన్నాయా? నిందితుడు పేరు మోసిన రౌడీషీటరా? గతంలో ఓ మహిళా నేత హత్యలో నిందుతుడా? ఇప్పుడు సాగరనగరంలో ఈ విషయాలపైనే చర్చ జరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి కిడ్నాప్ వ్యవహారం నడుస్తోందని.. కానీ గురువారం ఉదయం వెలుగులోకి రావడంపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రకరకాల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. పోలీసులు మాత్రం ఇది నగదు కోసం చేసిన నేరమంటూ తేల్చిచెబుతున్నారు. నిందితుడిపై ఈ తరహా నేరారోపణలు ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ మహిళా నేత, కార్పొరేటర్ విజయశ్రీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఓ రౌడీషీటర్ పేరు వినిపించింది. ఇప్పుడు అదే రౌడీషీటర్ కిడ్నాప్ లో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. అనేక బ్లాక్ మెయిలింగులు, కిడ్నాపుల్లో సిద్ధహస్తుడు. చాలా కేసుల్లో ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ముఠాలను ఏర్పాటుచేసుకొని నేరాలకు పాల్పడుతుంటాడు. ఇప్పుడు ఏకంగా ఎంపీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. అధికార పార్టీ ఎంపీ, ప్రముఖ బిల్డర్ అయిన ఎంవీవీ సత్యనారాయణను టచ్ చేయడంతో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.
కిడ్నాప్ మొత్తం పక్కా స్కెచ్ తో సాగింది. తొలుత ఎంపీ కుమారుడ్ని అపహరించినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఆడిటర్ వెంకటేశ్వరరావు అని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కిడ్నాపర్లు చాలా తెలివిగా వ్యవహరించారు. ముగ్గుర్ని కారులో తిప్పుతూ పోలీసులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు విశాఖ నగరాన్ని జల్లెడ పట్టేశారు. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగానికి సైతం అలెర్ట్ చేశారు. ఆడిటర్ వెంకటేశ్వరరావు ఫోన్ తో లోకేషన్ ను గుర్తించగలిగారు.
అంతకు ముందే ఆడిటర్ వెంకటేశ్వరరావు కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి వివరాలు రాబెట్టారు. బుధవారం రాత్రికే సుమారు కోటి రూపాయలను కిడ్నాపర్లకు ముట్టజెప్పినట్లు డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఎంపీ కుమారుడి కారు పద్మనాభం వైపు వెళుతుండడాన్ని ఫీల్డ్ లో ఉన్న పోలీసులు గుర్తించారు. మొత్తం అష్ట దిగ్బంధం చేశారు.దీంతో కిడ్నాపర్లు తప్పించుకునే క్రమంలో పోలీసు జీపును ఢీకొట్టారు. ఒకరిద్దరు సిబ్బంది గాయపడినట్టు తెలుస్తోంది. కిడ్నాపర్లు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు రాబెట్టారు. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ గురించి అడుగగా.. వారిని హైవేపై దించినట్టు చెప్పడంతో వారిని సేఫ్ జోన్ కు తీసుకొచ్చారు. దీంతో కథ సుఖాంతమైంది. కానీ మొత్తం ఎపిసోడ్ లో ఎన్నెన్నో ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.