Pithapuram Constituency : పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కంచుకోటగా మార్చుకోవాలని భావిస్తున్నారా? శాశ్వత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోనున్నారా? తనదైన మార్క్ చూపి పిఠాపురం అభివృద్ధి చేసి చూపించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్.విశాఖ జిల్లా గాజువాక,పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోటీ చేసి.. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. దీంతో గత ఐదేళ్లుగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో చాలా రకాల ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం తెరపైకి వచ్చారు. పొత్తులో భాగంగా జనసేనకు ఆ సీటును కేటాయించారు.అదే స్థానం నుంచి పోటీ చేశారు పవన్. అయితే పవన్ నాన్ లోకల్ అని
.. గెలిచాక వెళ్లిపోతారని వైసిపి ప్రచారం చేసింది. కానీ ఆ ప్రచారాన్ని పిఠాపురం ప్రజలు నమ్మలేదు. 70 వేల మెజారిటీతో గెలిపించారు. పవన్ డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కూడా కొనుగోలు చేశారు. అందులో సొంత ఇంటిని నిర్మించుకోనున్నారు. దీంతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. పెద్ద ఎత్తున ప్రజలు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు.దీంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ తరుణంలో పిఠాపురం నియోజకవర్గం లో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు రావడం విశేషం. ఇకనుంచి పిఠాపురం కేంద్రంగా సినిమా ఈవెంట్లు సైతం నిర్వహించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
* ఆ హామీతో
పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మెగా కుటుంబం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఆసుపత్రి నిర్మాణానికి చిరంజీవి కుటుంబం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఆసుపత్రుల యాజమాన్యానికి చెందిన వ్యక్తి అయిన సంగతి తెలిసిందే. అందుకే పిఠాపురంలో అపోలో బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు ఓ పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పిఠాపురం ప్రజలకు 24 గంటల పాటు వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
*త్వరలో చిరంజీవి ఈవెంట్
చిరంజీవి తాజాగా విశ్వంభర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష కథానాయకగా వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మెగా కుటుంబమంతా మరోసారి పిఠాపురం రావడం ఖాయం.
* గ్రామాల దత్తత
మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు.ఆ కుటుంబానికి సినీ రాజకీయ రంగాల్లో సన్నిహితులు చాలామంది. వారంతా పిఠాపురంలోని మారుమూల గ్రామాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తయినట్లు సమాచారం. అదే జరిగితే పిఠాపురం ప్రజలు గుండెల్లో పవన్ చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. పిఠాపురం పవన్ కు శాశ్వత నియోజకవర్గం గా మారడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.