YCP: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) తేల్చి చెప్పారు. శాసనసభకు హాజరుకావడం లేదని తేల్చేశారు. శాసనమండలిలో కూటమి ప్రభుత్వంతో తేల్చుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఉంది. ఆ పార్టీకి చెందిన నేత శాసనమండలి చైర్మన్గా కూడా ఉన్నారు. అసెంబ్లీలో 164 సీట్లతో కూటమికి ఏకపక్ష బలం ఉంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా అక్కడ లేదు. దీంతో సభకు వెళ్లేందుకు జగన్ వెనుకడుగు వేస్తున్నారు. ప్రతిపక్ష హోదాతో ముడి పెడుతున్నారు. శాసనమండలిలో మాత్రం తేల్చుకుంటామని చెబుతున్నారు. కానీ అదే శాసనమండలిని వైసిపి హయాంలో రద్దుకు ప్రయత్నించారు. కానీ అదే శాసనమండలి ఇప్పుడు వైసీపీకి దిక్కుగా మారింది.
* టిడిపికి బలం ఉండడంతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన బలం ఉంది. అప్పట్లో మండలి చైర్మన్గా టిడిపి నేత ఉండేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి పావులు కదిపేది. బిల్లులు సైతం శాసనమండలిలో వీగిపోయేవి. మూడు రాజధానుల అంశానికి సంబంధించి బిల్లు కూడా శాసనమండలి ముందుకు వచ్చింది. అది కూడా వీగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి దానిని ఒక సీరియస్ అంశంగా తీసుకున్నారు. 2020 జనవరిలో శాసనమండలిని రద్దుచేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని రూపొందించారు. అది శాసనసభలో నెగ్గింది. ఓటింగ్ నిర్వహించగా 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారు. దానిని కేంద్రానికి నివేదించారు. కేంద్రం వద్ద ఆ బిల్లు పెండింగ్లో ఉండిపోయింది. క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం శాసనమండలిలో పెరిగింది. తర్వాత శాసనమండలి రద్దు అనే అంశాన్ని మరిచిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* పనికొచ్చిన శాసనమండలి..
అయితే ఇప్పుడు అదే శాసనమండలిని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు తాను రద్దు చేస్తాననుకున్న వ్యవస్థ ఇప్పుడు దిక్కు అయింది. శాసనమండలి చైర్మన్ తమ పార్టీ వారే కావడం.. శాసన మండలి లో వైసీపీ పక్ష నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో ఏడాది వరకు శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరవాలేదు. తరువాతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే నాడు జగన్ నిర్ణయం తప్పు అని జగన్ ఒప్పుకున్నట్లు అయ్యింది. అప్పుడే శాసనమండలి రద్దు చేసి ఉంటే అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయేది. గతంలో ఎన్టీఆర్ కూడా ఏకంగా శాసనమండలిని రద్దు చేశారు. మళ్లీ వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పునరుద్ధరించారు. కనీసం తన తండ్రి పునరుద్ధరించారన్న వ్యవస్థను రద్దు చేయాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. కానీ తన తండ్రి పునరుద్ధరించిన శాసనమండలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దిక్కు అయింది. అందుకే అంటారు రాజకీయాల్లో దూకుడు నిర్ణయాలు పనికి రావని. శాసనమండలిని రద్దు చేస్తానని జగన్ ఆరాటపడ్డారు కానీ.. అదే శాసనమండలి ఇప్పుడు ఆయనకు దిక్కుగా మారడం నిజంగా గుర్తించాల్సిన అంశం.