Left parties vs Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రజా ఉద్యమాలకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. రేపు ఆ ప్రతులను తీసుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. అయితే ఎంతటి ఉద్యమం అయినా ఇతర రాజకీయ పక్షాలు సహకరిస్తేనే సక్సెస్ అయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డికి సహకరించేందుకు చిన్న రాజకీయ పార్టీలు సైతం ముందుకు రావడం లేదు. గతంలో వారి పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో వారి దూరంగా ఉన్నారు. కలిసి వచ్చిన పార్టీలతో ప్రజా ఉద్యమాలు చేపడతామని మొన్నటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఒక పార్టీ కూడా వైసిపి లైన్ లోకి రాలేదు. జడ శ్రవణ్ కుమార్ లాంటి వారి పార్టీ మాత్రం కొంచెం అతిచేస్తోంది. అయితే అది ఆయన వరకే. ఎందుకంటే ఆ పార్టీకి క్యాడర్ అంటూ లేదు. అదే ఉంటే ఆయనకు వందల ఓట్లు ఎందుకు వస్తాయి?
అమరావతి ఉద్యమానికి ఊపిరి..
చంద్రబాబు( CM Chandrababu) 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 23 స్థానాలకు పరిమితమయ్యారు. 151 స్థానాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించింది. అయితే అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అటువంటి సమయంలో వామపక్షాలతో పాటు చాలా పార్టీలు టిడిపి తో కలిసాయి. అమరావతి రాజధాని ఉద్యమ సమయంలో టిడిపికి వామపక్షాలు, కాంగ్రెస్, బిజెపి, జనసేన పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అమరావతి ఉద్యమం వెనుక తెలుగుదేశం పార్టీ ప్రధానంగా నిలిస్తే.. మిగతా పార్టీలు సైతం అండగా నిలిచాయి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏకాకిగా నిలిచింది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ ఏకాకి గానే మిగులుతోంది. ముమ్మాటికి ఆ పార్టీకి అది మైనస్ కూడా. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీకి మిగతా పక్షాల అవసరం ఉంటుంది. ప్రజా ఉద్యమాలు అంటే వామపక్షాలు సైతం ఉండాల్సిందే. కానీ వామపక్షాలు సైతం జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు ముందుకు రావడం లేదు.
ద్వంద వైఖరి ఉంటే కష్టమే..
జగన్మోహన్ రెడ్డిలో ద్వంద వైఖరి కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏ కూటమిలో లేరు. కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేక భావనతో ఉన్నారు. బిజెపి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వైఖరి వామపక్షాలకు నచ్చడం లేదు. బిజెపితో స్నేహం కటీఫ్ చెబితేనే జగన్మోహన్ రెడ్డితో వామపక్షాలు కలిసేది. కానీ ఆయన నేను స్నేహితుడును అని చెప్పరు.. వ్యతిరేకిస్తున్నట్లు అంతకంటే చెప్పరు. మద్య మార్గం అనుసరిస్తున్న వరకు ఆయనతో చెలిమి చేసేందుకు వామపక్షాలు ముందుకు రావు. అందుకే ఉనికి లేని ఆమ్ ఆద్మీ, బహుజన్ సమాజ్ పార్టీ వంటి వాటిని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురయింది.