Political Round Up 2024 : సాధారణంగా కాలం ఒకేలా ఉండదు. కొందరిలో వెలుగులు నింపుతుంది. మరికొందరిలో చీకటి పంచుతోంది.అయితే చీకటి వెనుక వెలుగులు వస్తాయి.అది సహజ ప్రక్రియ కూడా.2024 కూడా మంచి చెడ్డల, సుఖదుఃఖాల మేలి కలయికగా చెప్పవచ్చు. ఇదే ఏడాది జగన్ ను అధికారానికి దూరం చేసింది. చంద్రబాబు చేతిలోకి పవర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తెలియజెప్పింది. అలాగే రాజకీయంగా ఒక కుటుంబానికి అయితే చాలా రకాలుగా కలిసి వచ్చింది. అది కింజరాపు కుటుంబం. ఆ కుటుంబం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు. అది కూడా క్యాబినెట్ హోదా. మరొకరు రాష్ట్ర మంత్రిగా పదవి దక్కించుకున్నారు. కీలక శాఖను కూడా పొందారు. తద్వారా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ కుటుంబానిది ఫుల్ పవర్ అన్నట్టు పరిస్థితి మారింది.
* ఒకరు కేంద్రమంత్రి,ఇంకొకరు రాష్ట్ర మంత్రి
తెలుగుదేశం పార్టీలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక స్థానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం అదే పార్టీలో కొనసాగుతోంది. బంధుగణం కూడా టిడిపిలో కొనసాగుతూ వచ్చింది. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు రామ్మోహన్ నాయుడు. తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు గెలుపు బాటపడుతూ వచ్చారు. ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి మూడోసారి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అత్యంత పిన్న వయసులో కేంద్రమంత్రిగా ఎంపికయ్యారు. పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెనాయుడు నేతృత్వంలో పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అచ్చెనాయుడు. చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకోవడమే కాకుండా కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. ఒకే కుటుంబంలో కేంద్రమంత్రి తో పాటు రాష్ట్ర మంత్రి ఉండడం అరుదు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో సీనియర్లకు ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు. కానీ కింజరాపు కుటుంబం పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
* ఆ ఇద్దరూ అలా
మరోవైపు విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి గెలిచారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. ఈయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు. ఈయన స్వయాన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మామ. బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెనే రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్నారు. చివరి నిమిషంలో మాడుగుల టిడిపి టికెట్ దక్కించుకున్న ఈయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇంకోవైపు దివంగత ఎర్రం నాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎర్రం నాయుడు కుమార్తె శైలజా గెలుచ్చారు. అయితే ఈసారి రాజమండ్రి సిటీ నుంచి అల్లుడు వాసు పోటీ చేసి గెలిచారు. ఇలా కింజరాపు కుటుంబం ఏపీ రాజకీయాల్లో తమదైన ముద్ర చాటుకుంది ఈ ఏడాదిలో.