JanaSena: జనసేనకు నేతల తాకిడి పెరిగింది. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం రద్దీగా మారింది. నిత్యం నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఆశావహులు నేరుగా వచ్చి పవన్ ను కలుస్తున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లను కేటాయించారు. మరో మూడు పార్లమెంట్ స్థానాలను సైతం ఇచ్చారు. అయితే తొలి జాబితాలో పవన్ కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. దీంతో మిగతా 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున పవన్ ను కలుస్తున్నారు. తమ దరఖాస్తులను అందిస్తున్నారు.
మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్టే. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఖరారు చేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి చాలా సతీష్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. అనకాపల్లి నుంచి నాగబాబు బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ అక్కడ ఆలోచన మారినట్లు తెలుస్తోంది. పవన్ సైతం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇంకా 19 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పవన్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబుతో నియోజకవర్గాలపై స్పష్టత తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బిజెపి రావడం ఆలస్యంగా మారుతుండడంతో జనసేన అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఇప్పటికే టిడిపి 94 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బిజెపి వస్తే మిగతా 77 స్థానాలను మూడు పార్టీలు ఒకేసారి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన 19 స్థానాల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి సీనియర్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పని చేసి వైసీపీలోకి వెళ్లిన చాలా మంది నాయకులు.. నేరుగా జనసేన లో కలుస్తున్నారు. వారంతా టిడిపిలో చేరాల్సిన నేతలేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ వారిని జనసేనలోకి పంపించి టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్తపల్లి సుబ్బారాయుడు, కొణతాల రామకృష్ణ, బాలశౌరి లాంటి నేతలు ఈ కోవలోకే చెందుతారని టాక్ నడుస్తోంది. అయితే వివిధ పార్టీల్లో అవకాశాలు దక్కని చాలామంది నాయకులు జనసేన ఆశావహులుగా మారుతున్నారు. అందుకే జనసేన కేంద్ర కార్యాలయం నేతలతో కిటకిటలాడుతోంది. అయితే టికెట్ విషయంలో పవన్ చాలా గోప్యత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.