Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ లపై నాని తీవ్రంగా విరుచుకుపడుతుంటాడు. ఒక విధంగా కొడాలి నాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్న ఆరోపణ ఉంది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ విమర్శల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉంటారన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతాయి. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రస్తావిస్తూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈసారి వైసీపీకి ఓటు వేయాలని నాని విజ్ఞప్తి చేశారు.
ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీని బహిష్కరిస్తారని నాని ఆరోపించారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుంచి బయటకు తోసేసినట్టే.. తారక్ ని సైతం గెంటేస్తారని చెప్పుకొచ్చారు. లోకేష్ కోసం చంద్రబాబు ఎంత దాకా అయినా తెగిస్తారని.. పుట్టినరోజుకు, చావుకి తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయడానికి ప్రయత్నిస్తారని.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేస్తారని ఆరోపణలు చేశారు. టిడిపి, జనసేన సంయుక్తంగా జయహో బీసీ పేరిట బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిని టార్గెట్ చేసుకుంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో లేరు. కనీసం యాక్టివ్ గా కూడా పనిచేయడం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, చివరికి చంద్రబాబు అరెస్టుపై కూడా స్పందించలేదు. అటువంటి వ్యక్తిపై కుట్రలు చేసే అవకాశం ఏముందని.. పార్టీలో లేని వ్యక్తిని ఎలా గెంటేయగలరని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి పార్టీ వెళుతుందన్న నాని కామెంట్స్ పై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. నాని మాటల్లోనే కుట్ర కోణం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు పార్టీలో లేని జూనియర్ ఎన్టీఆర్ను ఎలా తొక్కి పెడతారని ప్రశ్నిస్తున్నారు. నందమూరి, నారా కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకే కొడాలి నాని ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నానికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అప్పుడే కొడాలి నాని కి ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.