Homeఆంధ్రప్రదేశ్‌JanaSena: పవన్ త్యాగానికి అంతు లేదా? అంతర్మధనంలో జనసైనికులు

JanaSena: పవన్ త్యాగానికి అంతు లేదా? అంతర్మధనంలో జనసైనికులు

JanaSena: జన సైనికులు తీవ్ర అంతర్మధనంతో ఉన్నారు. జనసేనకు దక్కిన సీట్లు చూసి బాధపడుతున్నారు. ఎంతో ఊహించామని.. కానీ పార్టీ పరిస్థితి ఏంటని.. కక్కలేక మింగలేక గిలగిలలాడుతున్నారు. లోలోపల మధనపడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లకు తట్టుకోలేకపోతున్నారు. కొద్ది రోజుల కిందట జనసేనకు 20 సీట్లు అంటూ ప్రచారం జరిగింది. దానిని పవన్ ఖండించారు కూడా. ఇప్పుడు అదే పవన్ 21 స్థానాలకు ఒప్పుకోవడం జన సైనికులకు అంతు పట్టడం లేదు.

టిడిపి,బిజెపి,జనసేన మధ్య సీట్ల లెక్క తేలింది. జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు, బిజెపికి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను టిడిపి కేటాయించింది. మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టిడిపి పోటీచేయనుంది.అయితే జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే తక్కువగా కనిపిస్తుండగా.. అందులో మూడు స్థానాలను పవన్ త్యాగం చేశారు. ఒక పార్లమెంట్ స్థానాన్ని సైతం వదులుకున్నారు. దీనితో జనసేన పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటిపై ఎలా స్పందించాలో తెలియక జనసైనికులు సతమతమవుతున్నారు.

మరోవైపు పొత్తులు కుదిరినా.. జనసేనకు కేటాయించిన సీట్లలో పూర్వపు టిడిపి నాయకులు అభ్యర్థులుగా మారుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాల్సిన వారు జనసేనలోకి వచ్చి టికెట్లు దక్కించుకుంటున్నారు. జనసేన రిమోట్ చంద్రబాబు వద్ద ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే పొత్తుల కోసం తనకు లభించిన సీట్లు పవన్ వదులుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే తక్కువ సీట్లు లభించాయని జనసైనికులతో పాటు కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం ఉంది. దీనిని తగ్గించుకునేందుకేనైనా ఒకటి రెండు సీట్లు పెంచుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ పై ఉంది. కానీ తన వద్ద ఉన్న ఈ మూడు అసెంబ్లీ స్థానాలను బిజెపి కోసం వదులుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు ఈ 21 మంది అభ్యర్థుల్లో ఎంతమంది గెలుస్తారు? అధికారంలోకి వస్తే ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయి? అన్న ప్రశ్నలు సగటు జన సైనికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే తన నిర్ణయమే ఫైనల్ అని.. తనను అనుసరించే వారే తనవారని ఇప్పటికే పవన్ చెప్పుకొచ్చారు. అందుకే సుశిక్షితులైన జనసేన కార్యకర్తలు అధినేత మాటకు అడ్డుపడడం లేదు. అటుగా ఇటుగా ఉండేవారు సైతం అధినేత నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే పొత్తు వర్కౌట్ కాదని.. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని తేల్చి చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version