Intermediate Exams : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడయింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 ప్రారంభమవుతాయి. 19వ తేదీ వరకు కొనసాగుతాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగనున్నాయి. మొదట పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.. ఆ తరువాత ఇంటర్ పరీక్షల తేదీలను రిలీజ్ చేశారు. విద్యార్థుల ప్రిపరేషన్ పై దృష్టి సారించేందుకు, సరిగ్గా ప్లాన్ చేసుకునేందుకు ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అన్నారు. ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
* ముగిసిన ఫీజు ప్రక్రియ
ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు ప్రక్రియ పూర్తయింది. అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు గడువు సైతం విధించారు. అది కూడా పూర్తయిన క్రమంలో ఇంటర్ షెడ్యూల్ ప్రకటించారు. ఇంటర్ బోర్డు కీలక ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణతా శాతం తక్కువగా వచ్చింది. ఈసారి అలా కాకుండా మెరుగైన ఫలితాలు వచ్చేలా ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
* పదో తరగతి షెడ్యూల్ వెల్లడి
మరోవైపు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ వెసులబాటును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని.. మంచి మార్కులు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.