Srikakulam : అనుమానం పెనుభూతమైంది. ఓ మనిషిని నరహంతకుడిగా మార్చింది. యావత్ కుటుంబాన్నే మట్టుబెట్టడానికి పురిగొల్పింది. ఆయన చేసిన దాడిలో పెద్దకుమారుడు ప్రాణాలు వదలగా.. చిన్న కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో చోటుచేసుకుంది. ఓ మనిషి క్షణికావేశానికి కుటుంబం మొత్తం మూల్యం చెల్లించుకుంది.
కొండ్ర కుప్పయ్య అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆయనకు భార్య హరమ్మ, కుమారులు తాతారావు, కామరాజు, కుమార్తెలు అప్పయ్యమ్మ, లక్ష్మిలు ఉన్నారు. ఇందులో అప్పయ్యమ్మకు మాత్రమే వివాహం జరిగింది. వీరంతా వ్యవసాయ కూలీలు. స్థానికంగా ఉపాధి గిట్టుబాటుకాక కుమారులిద్దరూ విజయవాడ, రాజమండ్రికి వలస వెళుతుంటారు. ఇటీవల గ్రామంలో గ్రామదేవత సంబరాలు జరగడంతో కుమారులు ఇద్దరూ ఇంటికి చేరారు. కుటుంబమంతా కలిసి ఉంటున్నారు.
ఈ తరుణంలో మంగళవారం రాత్రి ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో కుప్పయ్య పదునైన కత్తితో పెద్ద కుమారుడు తాతారావుపై వేటు వేశాడు. దీంతో ఒక్కసారిగా బిగ్గరగా అరచిన తాతారావు ప్రాణాలు వదిలాడు. తరువాత భార్య హరమ్మను చంపడానికి ప్రయత్నించగా చిన్నకుమారుడు కామరాజు అడ్డుకున్నాడు. కత్తితో దాడిచేయడంతో కామరాజుకు తీవ్రగాయాలయ్యాయి. హరమ్మ సైతం గాయపడింది. ఈ హఠాత్ పరిణామంతో చిన్నకుమార్తె లక్ష్మి బయటకు వెళ్లి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే కుప్పయ్య అక్కడ నుంచి పరారయ్యాడు.
కుప్పయ్యకు ఎప్పటి నుంచో భార్య హరమ్మపై అనుమానం ఉంది. ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని.. అందుకు కుటుంబం మొత్తం సహకరిస్తోందన్నది కుప్పయ్య అనుమానం. ఈ విషయంపై తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఒకే ఇంట్లో నివాసముంటున్నా కుప్పయ్య మాత్రం తానొక్కడే వంట చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టాలని కుప్పయ్య ప్రణాళిక రూపొందించుకున్నాడు. వరుసగా ఒక్కొక్కరి ప్రాణం తీయ్యాలని చూశాడు. పెద్ద కుమారుడి అతడి చేతిలో ప్రాణలొదలగా.. చిన్న కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనుమానం ఇంతటి అమానుషం సృష్టించిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.