Indukuri Raghuraju: వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లుతూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే.ఈనెల 11 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చింది.28న ఎన్నిక నిర్వహించి.. డిసెంబర్ 1న ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధపడింది. సరిగ్గా ఇదే సమయంలో హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బ్రేక్ పడినట్లు అయింది.అయితే ఇప్పటికే వైసీపీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది. స్థానిక సంస్థల్లో వైసీపీకి బలం ఉన్నందున తప్పకుండా తమ అభ్యర్థి గెలుస్తారని భావించింది. అందుకే సీనియర్ నేత శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ను రంగంలోకి దించారు జగన్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని ఎలా కైవసం చేసుకున్నామో.. అదే మాదిరిగా విజయనగరం ఎమ్మెల్సీ సీటును కూడా దక్కించుకుంటామని వైసిపి నేతల్లో ధీమా కనిపించింది. అమరావతిలో విజయనగరం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు జగన్. అభ్యర్థిని ఎంపిక చేసి దిశా నిర్దేశం చేశారు. ఇంతలోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వైసిపి నేతల్లో ఒక రకమైన ఆవేదన కనిపించింది.
* ఇదీ జరిగింది
2021లో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిచారు. ఈయన ఎస్ కోట నియోజకవర్గం లో కీలక నేత. 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు రఘురాజు. నియోజకవర్గంలోని ఐదు మండలాల మెజారిటీ వైసీపీ క్యాడర్ వెంటనే టిడిపిలోకి వెళ్లిపోయింది. రఘురాజు ఈ ఎన్నికల్లో స్తబ్దుగా ఉండిపోయారు. అయితే కూటమి గెలిచేసరికి రఘురాజు అధికార పార్టీ వేదికల్లో పాల్గొన్నారు. దీనిపై వైసీపీ శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో రఘురాజు పై అనర్హత వేటు పడింది. దీనిని సవాల్ చేస్తూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు.
* నోటిఫికేషన్ జారీ.. ఇంతలోనే
అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వైసిపి అభ్యర్థిని ఖరారు చేసింది. కానీ కూటమి నుంచి ఎటువంటి కదలిక లేకుండా పోయింది. ఈ తరుణంలో హైకోర్టు రఘురాజు పై అనర్హత వేటును రద్దు చేసింది. దీంతో వైసిపి ఆశలు నీరు గారి పోయాయి. రఘురాజు 2027 నవంబర్ వరకు పదవిలోనే కొనసాగనున్నారు. మొత్తానికి అయితే ఇది వైసీపీకి షాకింగ్ పరిణామమే.