Kadapa District SP: ఆ జిల్లా ఎస్పీ పై వేటు.. సోషల్ మీడియా కీచకుడే కారణం

ఆయన ఓ వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్.గత ఐదేళ్లుగా ప్రత్యర్ధులపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. చివరికి మహిళలని కూడా చూడలేదు. వారికి రంకులు కూడా అంటగట్టారు. అటువంటి వ్యక్తి విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అందుకు ఒక జిల్లా ఎస్పీ మూల్యం చెల్లించుకున్నారు.

Written By: Dharma, Updated On : November 6, 2024 7:12 pm

Kadapa District SP

Follow us on

Kadapa District SP: వైసీపీ శ్రేణుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీసుల విషయంలో పవన్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే.గత ప్రభుత్వం నుంచి ఇలాంటి ఉదాసీనత కొనసాగుతుండడాన్ని పవన్ ప్రస్తావించిన సంగతి విధితమే.ఇలానే వ్యవహరిస్తే తాను హోం శాఖ బాధ్యతలు తీసుకుంటానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని అంతా రాజకీయ కోణంలోనే చూశారు.కేవలం హోంమంత్రి అనిత పై టార్గెట్ చేశారని భావించారు. కానీ పవన్ మంత్రిపై మాట్లాడలేదు.పోలీస్ వ్యవస్థలో వైఫల్యాల గురించి ప్రస్తావించారు. పోలీస్ అధికారులు చక్కగా పనిచేయక పోవడాన్ని మాత్రమే ఎత్తిచూపారు.గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తో పాటు తనపై వ్యవస్థలతో ఏ విధంగా దాడి చేయించారో గుర్తు చేశారు. అయితే ఒకవైపు పోలీస్ వ్యవస్థ వైఫల్యాలపై చర్చ జరుగుతుండగానే.. ఈరోజు తాజాగా మరో ఘటన జరిగింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు, వెంటనే విడుదల చేయడంపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. కడప జిల్లా పోలీసుల వైఫల్యం పై సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీపై వేటు పడింది.ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితిలో జిల్లా ఎస్పీ ఉండడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

* పోలీస్ వ్యవస్థ పై పవన్ ఆగ్రహం
హోం శాఖ మంత్రి కంటే పోలీస్ వ్యవస్థ పనితీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు పోలీసులు ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారని.. వైసిపి అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నారని.. కుటుంబాలను కించపరుస్తున్నా.. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పోలీసులు పట్టించుకోవడంలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ఈరోజు ఇటువంటి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలపై దారుణంగా మాట్లాడిన రవీందర్ రెడ్డి లాంటి వారిని ఉదాసీనంగా విడిచిపెట్టడం వెలుగులోకి వచ్చింది. అందుకే కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్ కు దిగింది. కడప ఎస్పీపై వేటుతో ప్రభుత్వం తమ విధానమేంటో సంకేతాలు పంపింది. మున్ముందు మరింతమంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

* వైసిపి పై ఇప్పటికీ భక్తి భావం
కేవలం వైసీపీకి ప్రచార అస్త్రంగా మార్చేందుకు కొందరు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న ఆరోపణల వెనుక కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసిపి పట్ల ఇప్పటికీ కొంతమంది పోలీస్ అధికారులకు సానుకూలత ఉన్నట్లుఅనుమానాలు ఉన్నాయి.దానికి తగ్గట్టే పరిణామాలు జరుగుతున్నాయి.అంతకుమించి కేసుల విచారణ విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి జరగడం లేదు. ఇవన్నీ పవన్ ఆగ్రహానికి కారణం. తాజా పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీపై వేటు పడడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.