CM Chandrababu: ఐదేళ్లపాటు కేవలం సంక్షేమ పథకాలతో పాలన సాగించిన వైసీపీ సర్కార్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటడిపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రధానంగా ఏపీలో రోడ్ల తీరుపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం జరిగింది. రోడ్ల దుస్తితిపై మీమ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి రోడ్ల దుస్థితి కూడా ఓ కారణంగా చెబుతున్నారు. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ల మరమ్మతు, నిర్మాణంపై దృష్టి పెట్టింది.
పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రోడ్డ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు రూ.4,976 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో 250 మించి జనాభా ఉన్న ప్రతీ గ్రామానికి రహదారిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
కేంద్రం సహకారంతో..
ఏపీలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి కేంద్రం సహాయం కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. అంతమొత్తంలో నిధులు సమకూర్చడం కష్టం. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నందున సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్రంతో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంటు 10 శాతం తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.
అధికారులతో సమీక్ష..
ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విబాగంతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలకు రహదారుల అనుసంధానం పూర్తయితేనే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. రహదారుల నిర్మాణంతో గ్రామాల్లో పేదరిక నిర్మూలనతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరాలని తెలిపారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా..
మరోవైపు రహదారుల నిర్మాణం చేపట్టే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలకు బిల్లులు కూడా వెంట వెంటనే చెల్లించాలని తెలిపారు. గత ప్రభుత్వం బిల్లల చెల్లింపులో తీవ్ర జాప్యం చేసింని పేర్కొన్నారు. దీంతో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటు పడిందని తెలిపారు. బిల్లుల చెల్లింపు సమస్య పరిష్కారం అయితే గ్రామీణ రహదారులు నాణ్యతతో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్‌లో ప్రత్యేక కాలమ్ పొందుపర్చాలని ఆదేశించారు.
అమలులోకి వస్తే అద్భుతమే..
ఇదిలా ఉంటే.. ఏపీలో రోడ్లు ప్రస్తుతం అధ్వానంగా ఉన్నాయి. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర, గ్రామీణ రహదారులు చాలాచోట్ల ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయిన నేపత్యంలో మరో నాలుగు నెలల వరకు ఎలాంటి పనులు చేపట్టే అవకాశం లేదు. అక్టోబర్ నుంచి రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఆలోగా ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రంతో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంటు తగ్గింపు, రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి సహాయం కోరాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. పూర్తి ప్రతిపాదనతో కేంద్రాన్ని సహాయం కోరాలని అధికారులకు సూచించారు. కొత్త ప్రభుత్వం ఏడాదిలోగా ఏపీలో రహదారుల నిర్మాణం పూర్తి చేస్తే అది ఓ అద్భుతమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.