https://oktelugu.com/

AP Government: పాపం చంద్రబాబు సర్కారు కు ఎంత కష్టం

వైసిపి ప్రభుత్వ హయాంలో దుబారా ఖర్చులు బాగా పెరిగాయి. ఒకరోజు కౌన్సిల్ సమావేశంలోనే కేవలం టీ, స్నాక్స్ ఖర్చుల కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వెలుగు చూసింది. గుడివాడలో టిడ్కో గృహాల ప్రారంభోత్సవం సందర్భంగా.. కేవలం నిమ్మరసం ఖర్చులే 28 లక్షల రూపాయలు చూపినట్లు వార్తలు వచ్చాయి. చాలా శాఖల్లో దుబారా ఖర్చు బయటపడింది. ఈ నేపథ్యంలోనే టిడిపి కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఫర్నిచర్ ఏర్పాటుపై ఆంక్షలు విధించింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 12, 2024 / 12:54 PM IST

    AP Government

    Follow us on

    AP Government: అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది. వీలైనంతవరకు పొదుపు పాటించాలని చూస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ తన కార్యాలయంలో ఫర్నిచర్ ను సొంతంగానే సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. అటు తన శాఖల్లో అప్పులు చూసి.. జీతం తీసుకునేందుకు సైతం పవన్ ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని తెలియజేశారు కూడా. ఇప్పుడు ఆయననే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నట్టు ఉంది. అందుకే సంచలన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త ఫర్నిచర్ ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకుంది. పాత ఫర్నిచర్ ని కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది. అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది.

    వైసిపి ప్రభుత్వ హయాంలో దుబారా ఖర్చులు బాగా పెరిగాయి. ఒకరోజు కౌన్సిల్ సమావేశంలోనే కేవలం టీ, స్నాక్స్ ఖర్చుల కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వెలుగు చూసింది. గుడివాడలో టిడ్కో గృహాల ప్రారంభోత్సవం సందర్భంగా.. కేవలం నిమ్మరసం ఖర్చులే 28 లక్షల రూపాయలు చూపినట్లు వార్తలు వచ్చాయి. చాలా శాఖల్లో దుబారా ఖర్చు బయటపడింది. ఈ నేపథ్యంలోనే టిడిపి కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఫర్నిచర్ ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. రాజధాని లోని సచివాలయం తో పాటు కలెక్టరేట్లు, హెచ్ ఓ డి కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్ నే కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ ఆదేశించింది. కొత్త ఫర్నిచర్ కొనుగోలు పై నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

    సాధారణంగా ప్రభుత్వం మారిన పక్షంలో అన్ని శాఖలకు సంబంధించి ముఖ్య కార్యాలయాల్లో ఫర్నిచర్ ను మార్చడం ఆనవాయితీగా వస్తుంది. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు తమ అభిరుచులకు తగ్గట్టు క్యాంపు కార్యాలయాలను, ఫేషిలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఆనవాయితీకి బ్రేక్ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్. తన క్యాంపు కార్యాలయానికి సొంతంగానే ఫర్నిచర్ సమకూర్చుకుంటానని సంబంధిత అధికారులకు తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ సంస్కరణ తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా ఈ ఫర్నిచర్ ఖర్చు అన్ని శాఖలను కలుపుకొని కోట్ల రూపాయల్లో ఉంటుంది. ప్రభుత్వం అంత నిధులు భరించే స్థితిలో లేదు. అందుకే ఈ విషయంలో 2026 వరకు ఆంక్షలు విధించడం విశేషం.

    అయితే కొన్ని అత్యవసర విభాగాలకు, కొత్త కార్యాలయాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, కొత్తగా కట్టే కార్యాలయాలు, రాజ్ భవన్, హైకోర్టులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతోంది. అయితే ఈ ఫర్నిచర్ కొనుగోలు పై నిషేధం 2026 మే 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. గతంలో ఈ ఫర్నిచర్ ఖర్చు అధికంగా ఉండేది. పెద్ద ఎత్తున దుబారా జరిగేది. అందుకే దీనిపై నిషేధం విధించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ పొదుపు చర్యలపై అభినందనలు వెలువెత్తుతున్నాయి. అధికారిక వర్గాల నుంచి మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని పాటించడం విశేషం. మున్ముందు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫార్ములాను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.