https://oktelugu.com/

Kodali Nani: కొడాలి నానికి బిగిసిన ఉచ్చు.. అనుచరుడితోపాటు ముగ్గురిపై కేసు

వాలంటీర్ల ద్వారా వైసిపి రాజకీయ ప్రయోజనం దక్కించుకోవాలని చూస్తోందని.. ఓటర్ల పై ప్రభావం చూపుతోందని ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. దీంతో ఈసీ స్పందించింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 21, 2024 / 10:07 AM IST

    Kodali Nani

    Follow us on

    Kodali Nani: మాజీమంత్రి కొడాలి నాని కి షాక్ తగిలింది. వాలంటీర్ల ఫిర్యాదు పై ఆయన పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లు భారీగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో అలా రాజీనామా చేసిన వాలంటీర్లంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు మంత్రి కింజరాపు అచ్చెనాయుడును కోరారు. ఎన్నికలకు ముందు ఎవరి ఒత్తిడితో రాజీనామా చేశారో.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అటువంటి వారికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా గుడివాడలో వాలంటీర్లు మాజీ మంత్రి కొడాలి నానితో పాటు మరో ముగ్గురు నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి.

    వాలంటీర్ల ద్వారా వైసిపి రాజకీయ ప్రయోజనం దక్కించుకోవాలని చూస్తోందని.. ఓటర్ల పై ప్రభావం చూపుతోందని ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. దీంతో ఈసీ స్పందించింది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను తప్పించింది. అయితే వైసీపీ నేతలు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించి.. ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ ఏజెంట్లుగా వారిని కూర్చోబెట్టారు. వారి ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను తమ వైపు తిప్పుకోవాలని వైసిపి నేతలు భావించారు. కానీ ప్రజలు షాక్ ఇచ్చారు. టిడిపి కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. వైసీపీకి దారుణ పరాజయం ఎదురయింది. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాజీనామా చేసిన వాలంటీర్లు తమను విధుల్లో కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

    గుడివాడ నియోజకవర్గంలో సైతం కొడాలి నాని చాలామంది వాలంటీర్లపై ఒత్తిడి చేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. రాజీనామా చేసిన వారందరికీ మరోసారి అవకాశం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో వార్డు వాలంటీర్లు ఎక్కువగా రాజీనామా చేశారు. గుడివాడలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. పోలింగ్ లో కూడా సహకరించారు. తమను వేధించి వెంటాడి రాజీనామా చేయించారంటూ పలువురు మాజీ వలంటీర్లు కొడాలి నాని పై గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. నానితో పాటు ఆయన సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొడాలి నాని భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆయనపై టిడిపి తో పాటు జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మొన్నటికి మొన్న గుడివాడ పట్టణంలో కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న ఏడెకరాల భూమిని యజమానులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. దీంతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి కొడాలి నాని ఎలా అధిగమిస్తారో చూడాలి.