Nagababu: జనసైనికులకు ఇది పండుగ రోజు. సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నేడు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. ఈ ఎన్నికలకు ముందు వరకు పవన్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు. కానీ ఇప్పుడు ప్రభంజనం సృష్టించిన నేత. దేశం తన వైపు చూసుకునేలా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న నాయకుడు. అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదు పవన్ కు.
2014లో జనసేన ఆవిర్భవించింది. ప్రజారాజ్యం అనుభవాలను గుణ పాఠాలుగా మలుచుకుని పవన్ జనసేన ను స్థాపించారు. తొలి ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేశారు. కానీ ఒక్క రాజోలులో మాత్రమే రాపాక వర ప్రసాదరావు అనే జనసేన అభ్యర్థి గెలిచారు. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. అది మొదలు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు పడ్డారు పవన్. రెండు చోట్ల ఓడిపోయాడు, జనసేన ఒక పార్టీయేనా, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు అడుగడుగునా అవమానాలు చేశారు. ఆయన వైవాహిక జీవితంపై కూడా మాట్లాడారు. 2019 ఎన్నికలకు మాదిరిగానే పవన్ ను ఓడిస్తామని శపథం చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని హెచ్చరించారు.
టిడిపి తో పొత్తు పెట్టుకున్న జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. శత శాతం విజయం సాధించి.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందింది. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇష్టమైన నాలుగు గ్రామీణాభివృద్ధి శాఖలను సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకొని విజయ గర్వంతో నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ సంచలనం గా మారింది. సంకెళ్లు తెంచుకుంటూ ఓ సింహం ముందుకు సాగుతున్న వీడియోను జత చేశారు నాగబాబు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు కదా… టచ్ చేయండి అని ఆయన సవాల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విపరీతంగా ట్రోల్ అవుతోంది.