Achyutapuram Fire Accident : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదానికి కారణం అదే.. ఫ్యాక్టరీస్ విభాగం సంచలనం

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై రకరకాల కారణాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రియాక్టర్ పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగింది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఫ్యాక్టరీస్ విభాగం మాత్రం తన నివేదికలో వేరే కారణాలు చెబుతోంది.

Written By: Dharma, Updated On : August 22, 2024 12:16 pm

Achyutapuram Fire Accident

Follow us on

Achyutapuram Fire Accident : ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిందా?మరో కారణం ఏమైనా ఉందా?అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి?ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి తాజాగా ఇచ్చిన ప్రాథమిక నివేదికలో మరో కారణం చూపుతున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లో ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి.మరోవైపు మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులను పరామర్శించేందుకు ఈరోజు సీఎం చంద్రబాబు అనకాపల్లి వెళుతున్నారు. విజయవాడ నుంచి విమానంలో విశాఖ చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడ నుంచి అనకాపల్లి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.మధ్యాహ్నం ఘటనా స్థలానికి వెళ్ళనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామనికూడా హామీ ఇచ్చారు. ఇంకా పరిశ్రమ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

* తాజా నివేదిక ఇదే
తాజాగా ఈ ఘటనపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ప్రమాదం జరగడానికి రియాక్టర్ పేలడం కారణం కాదని తేల్చినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖర వర్మ మాట్లాడుతూ.. రియాక్టర్ లో తయారైన మిథైల్ టెర్డ్-బ్యూటైల్ ఈథర్ కెమికల్ ను స్టోరేజ్ ట్యాంక్ లోకి మార్చే సమయంలో లీక్ అయినట్లు చెప్పారు. ప్రొడక్షన్ బ్లాక్ లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంక్ లోకి కెమికల్ని సరఫరా చేసే సమయంలో ఇది లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆ కెమికల్ బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారిందని అనుమానం వ్యక్తం చేశారు. అది సాధారణ వాతావరణం లో ప్రతిస్పందించడంతోనే పేలుడు సంభవించినట్లు.. మంటలు వ్యాపించినట్లు చెప్పుకొచ్చారు.

* ఎన్నో అనుమానాలు
అయితే ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీస్ విభాగం ఇస్తున్న నివేదికలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం విశాఖలో ఎల్జి పాలిమర్స్ లో ఇటువంటి ఘటనే జరిగింది. అప్పట్లో 12 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 1000 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అప్పట్లో ఫ్యాక్టరీస్ విభాగం ఇచ్చిన నివేదికలను వైసిపి ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. కనీసం ఇక్కడి నుంచి ఫ్యాక్టరీని తరలిస్తామని యాజమాన్యం ముందుకు వచ్చినా అప్పటి పాలకులు అడ్డుకున్నట్లు ప్రచారంలో ఉంది.

* గాల్లో భద్రత
అయితే తాజాగా ఫ్యాక్టరీస్ విభాగం ఇచ్చిన నివేదికలు చూస్తుంటే.. పరిశ్రమలో భద్రతను గాలికొదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటి ప్రమాదకర రసాయనాల నడుమ పనిచేయాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. రసాయనం లీకై పేలుడు సంభవించిందంటే.. ఏ స్థాయిలో వాటి తీవ్రత ఉందో అర్థం అవుతుంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం.. తరువాత మరిచిపోవడం ప్రభుత్వ శాఖలకు ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా దీనిపై బుట్ట దాఖలు చేస్తారో.. లేకుంటే కఠిన చర్యలకు ఉపక్రమిస్తారో? లేదో? చూడాలి.