https://oktelugu.com/

Election Commission: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పి అడ్డంగా బుక్కయ్యాడు

నంద్యాలలో ఇటీవల సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది వివాదాస్పదంగా మారింది. ఈ పర్యటనకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2024 9:03 am
    Election Commission

    Election Commission

    Follow us on

    Election Commission: నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి పై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పి పై చార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎస్పీతో పాటు ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డి పై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో 144 సెక్షన్ అమలులో ఉండగా.. భారీగా జనాలు గుమిగూడడాన్ని తప్పు పట్టింది. జనాలను నియంత్రించడంలో వైఫల్యాన్ని తప్పుపడుతూ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

    నంద్యాలలో ఇటీవల సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది వివాదాస్పదంగా మారింది. ఈ పర్యటనకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ కు స్నేహితుడు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ నుంచి అల్లు అర్జున్ భార్యతో కలిసి నంద్యాల వచ్చారు. దీనిపై ముందుగానే ప్రచారం జరగడంతో భారీగా జనాలు తరలివచ్చారు. అల్లు అర్జున్ కారును అభిమానులు చుట్టుముట్టారు. రవిచంద్ర రెడ్డి తో పాటు అల్లు అర్జున్ బయట వేచి ఉన్న వేలాదిమంది అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కేవలం స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పేందుకే వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపారు.

    అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో..144 సెక్షన్ అమల్లో ఉండగా.. భారీగా జనాలు రావడంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పోలీస్ శాఖ స్పందించింది. అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు అయ్యింది. అయితే ఇప్పుడు ఏకంగా ఎస్పీ రఘువీర్ రెడ్డి పై ఛార్జ్ ఫైల్ చేయాలని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాయలసీమ డిఐజి అమ్మిరెడ్డి పై వేటు పడింది. అది మరువక ముందే నంద్యాల ఎస్పీ టార్గెట్ అయ్యారు. మరోవైపు తిరుపతికి చెందిన ఆరుగురు సిఐలపై బదిలీ వేటు వేశారు. అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు.