Jana Sena: ఏపీలో సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు.. జనసేన సంచలనం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున సలహాదారులను నియమించింది. గత ఎన్నికలకు ముందు పనికొచ్చిన వారిని.. ఈ ఎన్నికల్లో పనికొస్తారని చాలామందిని సలహాదారులుగా నియామకాలు చేసింది.

Written By: Dharma, Updated On : February 1, 2024 6:34 pm
Follow us on

Jana Sena: ఏపీలో సలహాదారులు ఎంతమంది ఉన్నారు? ప్రధాన సలహాదారులు ఎంతమంది? ఉప సలహాదారులు ఎంతమంది? ఇప్పటివరకు వారికి వేతనం రూపంలో చెల్లించింది ఎంత? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ సలహాదారులకు ఖర్చు చేసిన మొత్తం పై ప్రకటన చేయడంతో.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున సలహాదారులను నియమించింది. గత ఎన్నికలకు ముందు పనికొచ్చిన వారిని.. ఈ ఎన్నికల్లో పనికొస్తారని చాలామందిని సలహాదారులుగా నియామకాలు చేసింది. మరోవైపు కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. వాటికి పాలకవర్గాలను నియమించింది. అయితే సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన సలహాదారులకు, కార్పొరేషన్ చైర్మన్ లకు భారీగా వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 90 మంది వరకు సలహాదారులు ఉన్నట్లు తేలుతోంది. ఇప్పటివరకు వారికి ఖర్చు చేసింది అక్షరాల రూ.680 కోట్లుగా తేలింది. జీతం,ఇతరత్రా అలవెన్స్ రూపంలో ఈ మొత్తం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

సలహాదారు అంటే ముందుగా గుర్తుకొచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా ఆయనకు పేరు ఉంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా.. అటు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఆయన మాట చెల్లుబాటు అవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సకల శాఖ మంత్రి. ఆయన కోసం ప్రభుత్వం రూ.140 కోట్లు ఖర్చు చేసినట్లు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సలహాదారులకు ఇంత మొత్తంలో ఖర్చు చేస్తే.. రాష్ట్రం ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. అందుకే తాము సలహాదారుల నియామకంపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తోందని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. అసలు సలహాదారులు ఎటువంటి సలహాలు అందిస్తున్నారు? ఏం చేస్తున్నారో? తెలియని పరిస్థితి ఏపీలో నెలకొని ఉందన్నారు. అసలు వీరంతా ఎవరనేది ప్రజలకు తెలియాలని.. వారి పేర్లను తక్షణం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికైతే సలహాదారుల జీతాల అంశాన్ని జనసేన గట్టిగానే బయటకు తీసుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.