AP floods : ₹6,880 కోట్లు కోరితే ముష్టి రూ.1036 కోట్లు!.. ఇది ఏపీ వరదలకు కేంద్రం ఇచ్చిన సాయం

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కరుణించింది.వరద సాయాన్ని ప్రకటించింది. వెనువెంటనే మంజూరు చేసింది.గత నెలలో వరదలు విధ్వంసం సృష్టించగా.. తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు కేంద్రం దిగడం విశేషం.

Written By: Dharma, Updated On : October 1, 2024 8:48 pm

Rs. 1036 crore flood relief

Follow us on

AP floods : గత నెలలో వరదలకు ఏపీ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం చిగురుటాకులా వణికిపోయింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ నష్టం సంభవించింది. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరం ముంపు బారిన పడింది. దాదాపు నగరంలో సగభాగం.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో ఉంటూ సహాయ చర్యలను పర్యవేక్షించారు. అటు కేంద్ర బృందాలు సైతం రంగంలోకి దిగాయి.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి.కేంద్రం హెలిక్యాప్టర్లను సమకూర్చడంతో పాటు ఆర్మీని సైతం రంగంలోకి దించింది. అయితే అప్పట్లో ప్రధాని మోదీ స్పందించారు. పెను విపత్తుగా అభివర్ణించారు. కేంద్రం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అయితే నెల రోజులు గడుస్తున్నా కేంద్రం నుంచి సాయం విడుదల కాకపోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే ఏపీ నుంచి వెళ్లిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించింది. ఏపీకి రూ.1036 కోట్ల సాయాన్ని ప్రకటించింది.

* తెలుగు రాష్ట్రాల ఎదురుచూపు
ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చాలా రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయి. వరదలు ముంచెత్తడంతో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. కేంద్ర సాయం కోసం అన్ని రాష్ట్రాలు ఎదురుచూశాయి. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం ఉండడంతో.. మెరుగైన సాయం అందుతుందని అంతా భావించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ సైతం భారీ వర్షాలతో నష్టం జరిగింది. అక్కడి సీఎం రేవంత్ సైతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సాయాన్ని అభ్యర్థించారు.

* మహారాష్ట్రకు అధిక నిధులు
ప్రస్తుతం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో బిజెపి నేతలు బిజీగా ఉన్నారు. అందుకే వరద సాయం విషయంలో జాప్యం జరుగుతుందని ప్రచారం సాగింది. కానీ ఈరోజు అకస్మాత్తుగా కేంద్ర హోం శాఖ వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయాన్ని ప్రకటించింది. ఆ మొత్తాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు రూ.5858.60కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ నిధులు మంజూరు చేసింది.అందులో తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ. 416.80 కోట్లు మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు అధికంగా రూ.1492 కోట్ల వరద సాయం ప్రకటించడం విశేషం. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందున అత్యధిక సాయం ప్రకటించినట్లు విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ కంటే ఏపీకి ప్రాధాన్యం ఇవ్వడం కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వరదలు వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసింది. వరదలతో దాదాపు 6,800 కోట్ల నష్టం జరిగినట్లు చెప్పుకొచ్చింది.ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం కేంద్రానికి నివేదించారు.ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు.అటు టిడిపికి చెందిన కేంద్ర మంత్రులు,ఎంపీలు పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందించారు.కానీ అవేవీ పనిచేయలేదు.కేంద్రం కేవలం 1000 కోట్ల రూపాయలు అందించి చేతులు దులుపుకుంది. దీనిపై సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.