YS Jagan : అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనుకుంటున్న జగన్ కు కేంద్రం షాకిచ్చింది. ఆర్ 5 జోన్ లో 50 వేల మంది రాయలసీమ పేదలకు జగన్ పట్టాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని వైసీపీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఇందులో48 వేల ఇళ్లకు రూ.1.50 లక్షల చొప్పున నగదు సాయం చేయాలని కేంద్రం సైతం సమ్మతించింది. ఇందుకు సంబంధించి ఎస్టిమేట్ కమిటీ సమావేశమై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. తాము సాయం చేయలేనని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
అమరావతి ఆర్ 5 జోన్ లో ఉన్న భూములపై ప్రభుత్వం కన్నేసింది. ఇప్పటికే ఎలాగైనా అమరావతిని నిర్వీర్యం చేయాలనుకుంటున్న ప్రభుత్వం అందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. స్థానికేతరులను అక్కడ రంగంలోకి దించాలని భావించింది. రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 50 వేల మంది లబ్ధిదారులకు ఆ స్థలాల్లో పట్టాలివ్వాలని భావించింది. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించారు. అమరావతి అనేది అందరి రాజధాని అని.. అక్కడ పేదలు ఉండకూడదు అంటే ఎలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే జగన్ సర్కారు పట్టాల పంపిణీని ఉద్యమంలా చేపట్టింది. అక్కడ ఇళ్ల కట్టించే బాధ్యతను కూడా తానే తీసుకుంది. కేంద్ర సాయం కోసం ప్రతిపాదనలు పంపించింది. దీంతో కేంద్ర ఎస్టిమేట్ కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. 48 వేల ఇళ్లకు రూ.700 కోట్లు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అయితే కోర్టు ఇళ్ల పట్టాల వరకే అనుమతిచ్చిందని… ఇళ్లు నిర్మించుకునేందుకు కాదని కోర్టులో ప్రజాప్రయోజన పిటీషన్ దాఖలై ఉంది. పైగా అమరావతి ఇష్యూ కోర్టు విచారణలో ఉంది.
ఒకవేళ కోర్టులో అమరావతికి అనుకూల తీర్పు వస్తే ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయని విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి పరిశీలన చేసిన కేంద్రం నిధులు సాయం చేయలేమని తేల్చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు చెప్పింది. అయితే ఒక వేళ వ్యతిరేక తీర్పు వస్తే ..ఈ నిధులన్నీ వెనక్కి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం అనుమానాపు చూపులు చూసింది. దీంతో రాష్ట్ర అధికారులు వెనుదిరిగారు. మొత్తానికి 50 వేల ఇళ్లను కేంద్రసాయంతో కట్టి పొలిటికల్ క్రెడిట్ కొట్టేయ్యాలని చూసిన జగన్ సర్కారుకు గట్టి ఝలక్ తగిలింది.