Tirumala Laddu Controversy తిరుమలలో వివాదంలో కీలక ట్విస్ట్. ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గత కొద్దిరోజులుగా లడ్డు వివాదం ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యిలో జంతువు కలిపారని వెల్లడించారు. వైసిపి హయాంలో ఈ అపచారం జరిగిందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళనకు గురయ్యారు. జాతీయ స్థాయిలో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ కార్నర్ అయ్యింది. ఆత్మరక్షణలో పడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. దీంతో ఆ విచారణతో తమకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావించిన వైసిపి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు వైఖరిని తప్పు పట్టింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా, సరైన ఆధారాలు లేకుండా బహిరంగ సభలో ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందని తప్పు పట్టింది. సిట్ విచారణ అవసరమా? లేకుంటే దానికంటే మించిన దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా? అని సొలిసిటర్ జనరల్ కు సూచిస్తూ కేసును ఈ నెల 3కు వాయిదా వేసింది. నిన్న విచారణకు వచ్చిన కొద్దిసేపటికే ఈరోజుకు వాయిదా పడింది. ఈ తరుణంలో ఈరోజు కీలక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ, ఏపీ ప్రభుత్వంతో సహా ఐదుగురితో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
* ఎవరికి వారే వాదనలు
ఈరోజు విచారణ ప్రారంభమైన వెంటనే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తన వాదనలు వినిపించారు. మరో పిటిషనర్ టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదించారు. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూధ్ర, ముఖుల్ రహోద్గి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం కోట్లాదిమంది భక్తులకు సంబంధించిందని.. రాజకీయాలు సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. లడ్డు ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని మెహతా అభిప్రాయపడ్డారు. దీనిపై న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. సిపిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరితో ఈ సమస్త విచారణ చేసేలా ప్రతిపాదించారు. ఈ వ్యవహారం పై రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నిర్దేశించారు. కాగా సిపిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.
* సిబిఐతోపాటు ఏపీ ప్రభుత్వానికి భాగస్వామ్యం
అయితే ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. మొత్తానికైతే వైసీపీకి ఉపశమనం దక్కినట్టే దక్కి.. ఆందోళనలో నెట్టేసింది. ఈ విచారణ కమిటీలో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ పోలీసుల నుంచి ఇద్దరు పోలీసు అధికారులతో పాటు మరో సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పాటు అయిన తర్వాత విచారణ ప్రారంభం కానుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The cbi and the ap government have taken a decision by forming a special investigation committee with five members on the laddu controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com