Vahan Mitra Scheme: ఏపీలో( Andhra Pradesh) వాహన మిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ప్రతి ఆటో డ్రైవర్ కు 15వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో.. ఆటో డ్రైవర్లు ఉపాధికి దూరమయ్యారు. వారి విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం చంద్రబాబు వాహన మిత్ర పథకాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 1న ఆటో డ్రైవర్ల ఖాతాలో 15వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు చెప్పారు. పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సైతం ప్రారంభించారు. ఈనెల 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. నేటితో అది ముగియనుంది. ఈనెల 22న వెరిఫికేషన్ పూర్తి చేసి రవాణా శాఖకు పంపించనున్నారు. తుది జాబితాను ప్రకటించి అక్టోబర్ 1న లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.
* ఈకేవైసీ పూర్తి చేసుకుంటే..
వాహన మిత్ర పథకం( vahan Mitra scheme ) అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అమలైంది. అయితే అప్పట్లో ఒక్కో ఆటో డ్రైవర్ కు 10000 రూపాయలు మాత్రమే సాయం అందించారు. ఈసారి ఆ మొత్తాన్ని 15 వేలకు పెంచి ప్రకటించారు చంద్రబాబు. అయితే పాత వారు ఉంటే దరఖాస్తులు చేయనవసరం లేదు. ఇప్పటికే నమోదు చేయబడిన లబ్ధిదారులకు ఈ కేవైసీ వెరిఫికేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిపుచ్చుకోవచ్చు. గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఈ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేస్తే ఈ సాయం నిర్ధారితంగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ కేవైసీ కోసం తప్పనిసరిగా కొన్ని ధ్రువపత్రాలు పొంది ఉండాలి. ఆధార్ కార్డ్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ కాపీ, బ్యాంకు పాస్ బుక్, రేషన్ కార్డు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు ఈ పత్రాలతో వెళ్లి.. ఓటిపి ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ కేవైసీ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఏర్పడితే లాగ్ అవుట్ చేసి మళ్లీ లాగిన్ కావలసి ఉంటుంది. ఓటిపి రాకపోతే ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే పేర్లలో తేడాలు ఉన్నప్పుడు అదనపు గుర్తింపు సమర్పించాలి. ఈ పథకం స్టేటస్ను ఎప్పటికప్పుడు సచివాలయాలకు వెళ్లి తెలుసుకోవచ్చు. వాహన మిత్ర పథకం కింద సొంత వాహనం కలిగి ఉండి.. స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న వారు మాత్రమే అర్హులు. ఎక్కువ వాహనాలు ఉన్నా.. ఒకే ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* ఎన్నికల హామీ కాకపోయినా..
ఇకనుంచి ఏటా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర సాయం అందనుంది. వాస్తవానికి ఎన్నికల మ్యానిఫెస్టోలో( election manifesto) మాత్రం ఈ పథకం అమలకు హామీ ఇవ్వలేదు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో.. ఆటోలకు రద్దీ తగ్గింది. అందుకే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని ప్రకటించింది. ఇకనుంచి ఏటా ఈ పథకం అమలు కానుంది. ఈరోజు దరఖాస్తుకు చివరి రోజు కావడంతో అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 22న ధ్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తి చేసి.. రవాణా శాఖకు పంపించనున్నారు. అక్టోబర్ 1న ఆటో డ్రైవర్ల ఖాతాల్లో సాయం జమ కానుంది.