Mohan Babu: తెలుగు సినీ నటుడు మోహన్ బాబుకు( Mohan Babu) షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా పడింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్య కమిషన్ జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు మోహన్ బాబు యూనివర్సిటీ పై ఆరోపణలు ఉన్నాయి. గత మూడేళ్ల నుంచి ఈ రకంగా 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఉన్నత విద్య కమిషన్ స్పందించింది. విచారణ జరపడంతో నిజమేనని తేలింది. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
* అదనంగా ఫీజులు వసూలు..
గత కొన్నేళ్లుగా శ్రీ విద్యానికేతన్( Shri Vidyaniketan ) పేరిట తిరుపతిలో విద్యాసంస్థలు నిర్వహించారు మోహన్ బాబు. కేజీ నుండి పీజీ వరకు చదువు అందించేవారు. కొన్నేళ్ల కిందట మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల సైతం ఫిర్యాదులు చేశాయి. ఆందోళన కార్యక్రమాలు జరిపాయి. నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే దీనిపై విచారణ జరపడంతో యూనివర్సిటీ యాజమాన్యం ముందుగానే జరిమానా చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఒకవైపు అదనపు ఫీజు వసూలు, జరిమానా చెల్లించడం హాట్ టాపిక్ అవుతోంది.
* అప్పట్లో మనోజ్ ఆరోపణలు..
మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగిన సమయంలో మంచు మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతు ప్రకటించారు. అప్పట్లో అది సంచలన అంశంగా మారింది. తన తండ్రి ఎంతో ఉన్నత విలువలతో విద్యాసంస్థలను స్థాపించారని.. ఇప్పుడు వాటిపై వస్తున్న ఆరోపణల విషయంలో తాను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానంటూ మంచు మనోజ్ అప్పట్లో ప్రకటించడం చర్చకు దారితీసింది. యూనివర్సిటీలో ఆరోపణలపై ఫిర్యాదులు చేస్తే తాను మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని కూడా అప్పట్లో మనోజ్ ప్రకటించారు. అయితే అప్పట్లో ఆ గొడవ సమసి పోయిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఏపీ ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది. ఆరోపణలు నిజమేనని నిర్ధారించి జరిమానా విధించింది. అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీనిపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.