AP Employees Transfers  :ఉద్యోగుల బదిలీల్లో మార్పు.. కీలక ఆదేశాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!

ప్రభుత్వం కొలువు దీరగానే అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరపడం సర్వసాధారణం. నచ్చిన చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు పావులు కదపడం కూడా కామన్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలకు డిమాండ్ ఏర్పడింది.

Written By: Dharma, Updated On : August 30, 2024 2:39 pm

AP Employees Transfers

Follow us on

AP Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో కీలక ట్విస్ట్. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా సడలించింది. ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎప్పటికీ బదిలీల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈనెల 19 నుంచి 31 వరకు ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒక్క ఎక్సైజ్ శాఖకు మినహాయింపు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విలీనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే తాజాగా ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యతలను సచివాలయం ఉద్యోగులతో పాటు ప్రభుత్వ సిబ్బంది చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఏర్పాట్లలో వారు ఉన్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులతో పాటు పింఛన్ల పంపిణీలో పాల్గొనే సిబ్బంది బదిలీల గడువును వచ్చే నెల 16 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

* వారికి బదిలీ తప్పనిసరి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఐదు సంవత్సరాల పాటు ఒకే చోట పని చేసిన ఉద్యోగుల బదిలీ తప్పనిసరి చేసింది. పనిలో పనిగా రిక్వెస్ట్ బదిలీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావించింది. ఇప్పటికే ప్రారంభమైన బదిలీల ప్రక్రియను ఆగస్టు 31 తో ముగించాలని చూసింది. దీంతో బదిలీలపై నిషేధం సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేయాలని చూసింది. కానీ ఇప్పుడు మరో 15 రోజులు పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

* రేపటితో ముగియనున్న గడువు
గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపటితో ఉద్యోగుల బదిలీ గడువు ముగియనుంది. అయితే ఇంకా చాలా ప్రభుత్వ శాఖల్లో బదిలీలపై మార్గదర్శకాలు రాలేదు. దీంతో ఆయా సేకల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు కాలేదు. రవాణా శాఖలో ఆరోపణల నేపథ్యంలో బదిలీల మార్గదర్శకాలు విడుదల కాలేదు. అయితే వీటిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

* సిఫారసు లేఖల కోసం
రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ జరుగుతుండడంతో.. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ అధికారులు, ఉద్యోగులు తిరుగుతున్నారు. బయటకు పారదర్శకంగా బదిలీ ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నా.. రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగులు సిఫారసు లేఖలతో దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటికి అనుగుణంగా ఉద్యోగులు నచ్చిన చోట పోస్టింగులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బదిలీల ప్రక్రియ మరో 15 రోజులు పాటు పొడిగించడంతో నచ్చిన చోట పోస్టింగ్ వేయించేందుకు ఉద్యోగులకు కొంత సమయం దొరికింది.