AP Liquer Policy : ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త మద్యం పాలసీలో భాగంగా 99 రూపాయలకి క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. బ్రాండెడ్ మద్యం ను తిరిగి విక్రయించనున్నారు. ప్రైవేటు వ్యక్తులకి మద్యం దుకాణాలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం లైసెన్స్ ఫీజులను సైతం ఖరారు చేసింది. అక్టోబర్ తొలివారం నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో నాసిరకం మద్యం బ్రాండ్లు విక్రయించడంతోపాటు ధరలను అమాంతం పెంచారు. దేశంలో ఎక్కడా వినని బ్రాండ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ప్రజారోగ్యానికి విఘాతం కలుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపించినా.. అప్పటి వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. అందుకే తాము అధికారంలోకి వస్తే బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు.. తక్కువ ధరకే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు నూతన మద్యం పాలసీని రూపొందించారు. దానికి క్యాబినెట్ సైతం ఆమోదం ముద్ర వేసింది.
* సబ్ కమిటీ సిఫార్సులతోనే
మద్యం పాలసీ తయారీ విషయంలో ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. వాటి ప్రకారమే కొత్త మద్యం పాలసీని ప్రకటించింది.కొత్త పాలసీ ప్రకారం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానానికి రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది. రిటైర్లను ఎక్కువగా భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
* భారీగా షాపుల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా 3736 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో గీత కార్మికులకు 10 శాతం.. అంటే 340 దుకాణాలు కేటాయించనున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. లైసెన్స్ దక్కించుకున్న వారు షాపుల పక్కన వాకిన్ స్టోర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం అదనంగా ప్రభుత్వానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రాప్ బీరు తయారు చేసి విక్రయించే మైక్రో బ్రూవవరీలకు మళ్లీ అనుమతి ఇవ్వనున్నారు. అప్పటికప్పుడు బీరును తయారుచేసి మైక్రో బ్రూవర్రిల్లో విక్రయిస్తారు. మీరు బారుతో సమానంగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా 3396 షాపులకు నోటిఫికేషన్ ఇస్తారు. అందులో 10 శాతం అంటే 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
*జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు
షాపుల లైసెన్స్ ఫీజును భారీగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.జనాభాను ప్రాతిపదికగా తీసుకోనుంది. కనీసం 50 లక్షల నుంచి 85 లక్షల వరకు ఫీజులు పెట్టనుంది. ఎలైట్ షాపుల లైసెన్స్ ఫీజును కోటి రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటి కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ఏటా పది శాతం లైసెన్స్ ఫీజు పెంచుతూ వస్తారు. షాపుల దరఖాస్తు రుసుము రెండు లక్షలు. ఒక వ్యక్తి ఎన్ని షాపులుకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి మద్యం కంపెనీ కనీసం ఒక బ్రాండ్ ను తక్కువ ధరతో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం మరో నిబంధన పెట్టనున్నట్లు తెలుస్తోంది.
* క్వార్టర్ మద్యం అత్యల్ప ధర రూ.99
క్వార్టర్ మద్యం అత్యల్ప ధర 99 రూపాయలుగా నిర్ణయించారు.చీప్ లిక్కర్ క్వార్టర్ సీసా ధరలు తెలంగాణలో 140, కర్ణాటకలో 80, తమిళనాడులో 90, ఒడిస్సా లో 90 గా ఉన్నందున.. వాటి సగటును పరిగణలోకి తీసుకొని క్వార్టర్ మద్యం ధరను 99 రూపాయలుగా నిర్ణయించారు. గత ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన బ్రాండ్లను తొలగించి.. వాటి స్థానంలో గతంలో ఉన్న పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నారు.