Jagan: బీజేపీకి జగన్ అందుకే మద్దతు.. వైసీపీపై సెటైర్లే సెటైర్లు

కేంద్ర పెద్దలు వైసీపీని ఆశ్రయించారు. తాము నిలబెడుతున్న స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. పెద్దలు అడిగింది తడవుగా ఓకే చెప్పారు జగన్. తమ మద్దతు ఎప్పుడూ ఎన్డీఏకు ఉంటుందని ఏకంగా లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు.

Written By: Dharma, Updated On : June 26, 2024 10:33 am

Jagan

Follow us on

Jagan: ఎక్కువ ఎంపి స్థానాలు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ఏపీ రూపురేఖలే మార్చేస్తాను.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తరచూ చేసిన ప్రకటన ఇది. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా కేంద్రం మెడలు వంచలేదు. తిరిగి వంగి వంగి దండాలు పెడుతూ వారికే మద్దతు ఇచ్చారు జగన్. పార్లమెంట్ లోని రెండు సభల్లో సైతం.. ఈ సందర్భంలోనైనా బిజెపికి జై కొట్టారు. నిర్ణయాలు, బిల్లులు, జాతీయ అంశాలు.. ఇలా ఒకటేంటి అన్నింటికీ తమ మద్దతును తెలియజేశారు. కానీ గత ఐదు సంవత్సరాలలో కేంద్రానికి తన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మెలిక పెట్టలేదు జగన్.

ఈ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. మూడు పార్టీలు కలిసి వెళ్లాయి. ఘనవిజయం సాధించాయి. కానీ గత ఐదేళ్లుగా ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. తన అవసరం వచ్చినప్పుడు షరతులు విధించలేదు. కానీ ఇప్పుడు టిడిపి మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేసరికి.. ప్రత్యేక హోదా తేవాలంటూ సెటైర్లు వేయడం మాత్రం కొంచెం అతిగా ఉంది. తాను చేయలేని పనిని.. మీరైనా చేయండి అని చెబితే బాగుండేది. కానీ తన అసమర్ధతను కప్పిపుచ్చుకొని.. టిడిపి పై ప్రత్యేక హోదా బురద చల్లేందుకు జగన్ వేసిన ఎత్తుగడగా తెలుస్తోంది.

కేంద్ర పెద్దలు వైసీపీని ఆశ్రయించారు. తాము నిలబెడుతున్న స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. పెద్దలు అడిగింది తడవుగా ఓకే చెప్పారు జగన్. తమ మద్దతు ఎప్పుడూ ఎన్డీఏకు ఉంటుందని ఏకంగా లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారా? ఆ షరతుతోనే మద్దతు తెలిపారా? అని టిడిపి సెటైర్లు వేయడం ప్రారంభించింది. ఎన్డీఏ పూర్తి మెజారిటీ ఉంది. 290 మంది ఎంపీలతో మ్యాజిక్ ఫిగర్ కు దాటింది. కానీ అది మిత్రుల మద్దతుతో. అందులో 16 మంది సభ్యులతో టిడిపి కీలకంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బిజెపి తర్వాత పెద్ద పార్టీ టిడిపి. కానీ బేషరతుగా వైసీపీ మద్దతు ప్రకటించింది. మొన్నటికి మొన్న ఎన్డీఏలో టిడిపి చేరితే ప్రత్యేక హోదా అడగొచ్చు కదా అని వైసిపి సూచించింది. ఇప్పుడు అదే వైసిపి బిజెపి స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ప్రత్యేక హోదా గురించే కదా.. అంటూ టిడిపి ప్రశ్నిస్తోంది. ఇలా రెండు పక్షాలకు ప్రత్యేక హోదా ప్రధాన ఇష్యూ కావడం గమనార్హం.