YS Jagan : అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికేనా ఆ జగన్ లేఖ?

YS Jagan వాస్తవానికి ప్రతిపక్ష నేత అనేది ప్రోటోకాల్ మాత్రమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సింది జగన్ మాత్రమే. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు.

Written By: Dharma, Updated On : June 26, 2024 10:34 am
Follow us on

YS Jagan : ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష హోదా గురించి పెద్ద రచ్చ నడుస్తోంది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడాన్ని జగన్ తప్పు పడుతున్నారు. నేరుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు. స్పీకర్ ఎన్నికకు వైసీపీ సభ్యులు ఎందుకు రాలేదో వివరించే ప్రయత్నం చేశారు. వైసిపి ఇంకా చచ్చి పోలేదని.. దానిని చంపాల్సిన అవసరం ఉందని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యను జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు.అటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇచ్చినందునే తాము హాజరు కాలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే స్పీకర్ కు తనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖ రాయడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

అయితే జగన్ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతుండడంతో టిడిపి కౌంటర్ అటాక్ చేసింది. ప్రతిపక్ష హోదాకు పది సీట్లు ఉండాలని చట్టంలో లేదని జగన్ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. మరి అటువంటప్పుడు చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే 18 మందో.. 17 మందో అవుతారు.. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని సీఎం హోదాలో జగన్ మాట్లాడిన వీడియోను టిడిపి నేతలు షేర్ చేస్తున్నారు. అసెంబ్లీలో 10 శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఉద్దేశంతోనే జగన్ అలా మాట్లాడారు కదా అని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికే జగన్ ఆ లేఖ రాశారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు రాజ్యాంగం గురించి జగన్ ప్రస్తావించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నాడు పది శాతం సీట్లు టిడిపికి లేకుండా చేసి ప్రతిపక్ష హోదా ఉండకుండా చేయాలన్నది జగన్ ప్లాన్ అని.. ఇప్పుడు మాత్రం కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

వాస్తవానికి ప్రతిపక్ష నేత అనేది ప్రోటోకాల్ మాత్రమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సింది జగన్ మాత్రమే. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. హోదా తో సంబంధం లేకపోయినా ప్రతిపక్ష నేతగా ఆయనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారు. 2019లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 52 మంది ఎంపీలు గెలిచారు. ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే 54 సీట్లు రావాలి. రెండు సీట్లు తగ్గడంతో బిజెపి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీకి వచ్చిన సీట్లు 11 మాత్రమే. అంటే ఇంకా ఆరేడు సీట్లు కచ్చితంగా కావాలి. ఇది తెలిసి కూడా రాజ్యాంగం అంటూ కొత్త మాటలు చెబుతున్నారు జగన్. ఆయన తీరు చూస్తుంటే అసెంబ్లీకి రావాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. చంద్రబాబుకు గత ఐదేళ్లుగా జరిగిన అవమానం ఆయనకు తెలియంది కాదు. అందుకే కుంటి సాకులు వెతుక్కుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి.