Gone Prakash Rao
Gone Prakash Rao: ఏపీలో పోలింగ్ కు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ప్రచారానికి కూడా రెండు రోజుల గడువు ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. భారీ బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, ఇంటింటా ప్రచారం చేపడుతున్నాయి. ఈ తరుణంలో గెలుపు మాదంటే మాది అంటూ ధీమా కనబరుస్తున్నాయి. అదే సమయంలో సర్వేలు కూడా హల్చల్ చేస్తున్నాయి. కొన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి, మరి కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. ఈ తరుణంలో ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు తన కామెంట్స్ తో సంచలనాలు రేపిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు.. తాజాగా ఏపీ ఎన్నికలపై తన దృశ్యాన్ని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో గోనె ప్రకాష్ రావు ఒక వెలుగు వెలిగారు. ఈయన తెలంగాణ నేత. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. కానీ తెలంగాణలో జగన్ తన రాజకీయ కార్యకలాపాలను నిలిపివేశారు. కెసిఆర్ తో ఉన్న ఒప్పందం మేరకు తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచి గోనె ప్రకాష్ రావు వైసిపికి దూరంగా ఉన్నారు. వైసిపి విధానాలకు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏపీ వచ్చిన ప్రతిసారి వైసీపీ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. గత కొద్దిరోజులుగా సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడేవారు. ప్రతి ఎన్నికల్లోను జోష్యం చెబుతూ వచ్చారు. ఇప్పుడు పోలింగ్ ముందు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? అన్నది వెల్లడించారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని గోనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు. టిడిపి కూటమికి 145 స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పారు. టిడిపి బిజెపితో కలవడం వల్ల నష్టం జరిగినా.. అది ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేదని కూడా చెప్పారు. వై నాట్ 175 అన్న జగన్ అభ్యర్థులను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. చెల్లి షర్మిలను వదిలేసారని.. బాబాయిని చంపేశారని విమర్శించారు. సొంత చెల్లిని వీధిలో పడేసి.. మిగతా వారిని చెల్లెళ్ళుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తండ్రి వైయస్ మరణం తర్వాత కుటుంబాన్ని టార్గెట్ చేసిన బొత్స సత్యనారాయణ ను తండ్రిగా ఎలా అభివర్ణిస్తారని నిలదీశారు. ఈసారి ఏపీ ప్రజలు మాయమాటలను నమ్మే స్థితిలో లేరని.. గెలవబోయేది ఎన్డీఏ కూటమి అని గోనె ప్రకాష్ రావు తేల్చి చెప్పారు.