Vijayawada Floods: విజయవాడలో భారీ వరదలకు కృష్ణానది కారణమని అంతా భావించారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరగడం వల్లే విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని అనుకున్నారు. భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల వణికిపోయాయి. ప్రధానంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం నగరాలు తీవ్రంగా నష్టపోయాయి. విజయవాడ అయితే జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. లక్షలాది మంది జనాలు నిరాశ్రయులయ్యారు. గత రెండు రోజులుగా తిండి, నీరు లేక అల్లాడిపోయారు. చరిత్రలో ఎన్నడూ చూడనంత భారీ వర్షాలు, వరదలతో వారు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలో ప్రతి దృశ్యం హృదయ విదారకమే. అయితే విజయవాడకు ఈ పరిస్థితి రావడానికి ముమ్మాటికి నగరం మధ్యలో ప్రవహించే బుడమేరు కారణం. నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు వాగు ఆక్రమణలకు గురి కావడంతోనే వరద నీరు నగరంపై పోటెత్తినట్లు తెలుస్తోంది. విజయవాడ నగరం పక్క నుంచి ప్రవహించే కృష్ణా నది కంటే.. నగరం మధ్య నుండి ప్రవహించే గుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ ముప్పు ఉందని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.
* ఖమ్మం జిల్లాలో పుట్టి
ఖమ్మం జిల్లాలో పుట్టింది ఈ బుడమేరు. ఖమ్మం, కృష్ణాజిల్లాలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నిరంధించే ప్రధాన నీటి వనరు కూడా బుడమేరే. ఈ వాగులో గరిష్ట నీటి ప్రవాహం 11 వేల క్యూసెక్కులు. కానీ 2005లో 70 వేల క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారిగా విజయవాడ మునిగిపోయింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు చేపట్టింది. దీన్ని ప్రారంభించి సుమారు 20 సంవత్సరాలు సమీపిస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. బుడమేరు మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది. ఆపరేషన్ కొల్లేరు పూర్తిగా సక్సెస్ కాలేదు.
* పోలవరం కాలువలోకి అనుసంధానం
బుడమేరు వాగును 2008లో పోలవరం కుడి కాలువలోకి అనుసంధానించారు. అయితే కృష్ణానది ఎగువ నుంచి వరద కొనసాగినప్పుడు అందులో బుడమేరు నీటి ప్రవాహం చేరే అవకాశం లేదు. ఇటు పోలవరం కుడి కాల్వలో కలిపినా.. వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో కొల్లేటి సరస్సుకు అనుసంధానించిన వాగు కూడా ఆక్రమణలకు గురైంది. దాని ఫలితంగా వరద నీరు ఎక్కడికక్కడే పోటెత్తింది.
* ఆగిన కొల్లేరు ఆపరేషన్
2005లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ పనులు చేపట్టింది. కొద్దిరోజులకే ఇవి అటకెక్కాయి. బుడమేరు విజయవాడ నగరంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. నగరం కూడా విస్తరించింది. అయితే అక్రమ నిర్మాణాల పుణ్యమా అని బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. ఆ నిర్లక్ష్యం ఫలితం కారణంగానే తాజాగా వరదలు చుట్టుముట్టాయి. నగరం నీట మునిగింది. దీనిని గుణపాఠంగా మలుచుకుని.. సత్వర చర్యలు చేపట్టకపోతే.. విజయవాడ నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: That is the reason why vijayawada sank
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com